Chandrababu: ఈద్ ఎ మిలాద్ ఉన్ నబి, ‘‘వాల్మీకి జయంతి’’ సందర్భంగా చంద్రబాబు, బాలకృష్ణ శుభాకాంక్షలు
- వాల్మీకి చిత్రపటానికి నివాళులు
- వాల్మీకి జయంతి శుభాకాంక్షలతో ట్వీట్
- నేడు మిలాద్ ఉన్ నబీ పర్వదినం
- కారణజన్ముడు మహ్మద్ ప్రవక్త అంటూ స్పందించిన చంద్రబాబు
- ఉత్తమ జీవనమార్గాన్ని సూచించాడని వెల్లడి
వాల్మీకి జయంతి సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు. ప్రజలందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అధర్మం నుంచి ధర్మం వైపు, అసత్యం నుంచి సత్యసంధత వైపు సమాజాన్ని నడిపించాలన్నదే వాల్మీకి ఆశయం అని వివరించారు. అందుకే మానవుడి జీవితాన్ని సుఖమయం, ఆదర్శవంతం చేసే కుటుంబ, రాజకీయ ధర్మాలను ఎన్నింటినో వాల్మీకి రామాయణంలో పొందుపరిచారని చంద్రబాబు వెల్లడించారు.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహాకవి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించి... సాంస్కృతిక ఉత్సవంగా నిర్వహించామని పేర్కొన్నారు. అలాగే వాల్మీకి/బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపామని, ఆ కృషిని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని కోరుతున్నానని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అటు, ముస్లింలకు పర్వదినమైన మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా చంద్రబాబు స్పందించారు. అంతర్గత యుద్ధాలు, అంధ విశ్వాసాలు నెలకొని ఉన్న భూభాగం నుంచి అశాంతిని పారద్రోలి, శాంతిని నెలకొల్పి, ప్రపంచానికి ఉత్తమ జీవనమార్గాన్ని సూచించిన కారణజన్ముడు మహమ్మద్ ప్రవక్త అని కొనియాడారు. ఆయన జన్మదినమైన మిలాద్-ఉన్-నబీని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు వెల్లడించారు.
వాల్మీకి జయంతి సందర్భంగా టీడీపీ కార్యాలయంలోనూ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, శాసనమండలి సభ్యులు పర్చూరు అశోక్ బాబు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరాం ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి కొత్త నాగేంద్రబాబు, పార్టీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు, పార్టీ సీనియర్ నాయకులు దేవినేని శంకర్ నాయుడు, తెనాలి చిన్న తదితరులు పాల్గొన్నారు.
‘‘వాల్మీకి జయంతి’’, ఈద్ ఎ మిలాద్ ఉన్ నబి సందర్భంగా నందమూరి బాలకృష్ణ కూడా ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలియజేసారు.
భారత కుటుంబ వ్యవస్థకు ప్రామాణిక గ్రంథం రామాయణం. ప్రజాభిప్రాయమే పాలకుల ధర్మమని బోధించిన మహాకావ్యం. అలాంటి మహా కావ్యాన్ని రచించిన వాల్మీకి మహర్షి ధన్యజీవి.
పరిపాలన ఎలా ఉండాలో ‘రామాయణం’ చెబుతుంది.. పరిపాలనలో ప్రజావాణికే పెద్దపీట వేయాలనేది రామాయణం సారాంశం. ప్రజావాణిని నిర్లక్ష్యం చేస్తే రావణాసురుడి గతి ఏమైందో విదితమే.. ఎవరు ప్రజావాక్కుకు కట్టుబడతారో వాళ్లే సరైన పాలకులనేది రామాయణ సారం. వాల్మీకి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.
ఈద్ ఎ మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు. మహ్మద్ ప్రవక్త పుట్టినరోజును ‘‘మిలాద్ ఉన్ నబి’’గా పండుగ జరుపుకోవడం ప్రపంచ వ్యాప్తంగా ఆనవాయితీ. సర్వమానవ సౌభ్రాతృత్వం మహ్మద్ ప్రవక్త బోధనల పరమార్ధం. ఈర్ష్యాద్వేషాలకు అతీతంగా, కక్షా కార్పణ్యాలకు దూరంగా పరస్పర సోదరభావంతో జీవించడమే ప్రవక్త ప్రబోధం. మహ్మద్ ప్రవక్త బోధనలకు అనుగుణంగా శాంతి సౌభ్రాతృత్వాలతో జీవిద్దాం. పరమత సహనం, శాంతియుత సహజీవనమే ప్రవక్తకు మనం అందించే నిజమైన నివాళి’’.
అంటూ .. నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేసారు.