Worlds most flexible girl: శరీరంలో ఎముకలే లేనట్టు.. ప్రపంచంలోనే ఫ్లెక్సిబుల్ అమ్మాయిగా రికార్డు
- ఇంగ్లండ్ కు చెందిన లిబర్టీ బారోస్ అనే అమ్మాయి రికార్డు
- తలను వెనక్కి వంచి కాళ్ల మధ్యగా తెచ్చి ఉదరాన్ని నేలకు ఆన్చి ఫీట్
- ఇప్పటికే స్ప్రింగ్ లా శరీరాన్ని వంచుతూ ఫొటో షూట్లు.. ప్రత్యేక వెబ్ సైట్ కూడా..
జిమ్నాస్టిక్స్ వంటి క్రీడలు ఆడే వారిని చూస్తుంటాం.. కొందరు డ్యాన్సర్లనూ చూస్తుంటాం.. శరీరాన్ని ఎలా పడితే అలా వంచేస్తూంటారు. శరీరంలో అసలు ఎముకలు ఉన్నాయా, లేవా అన్నట్టుగా శరీరాన్ని మెలితిప్పేస్తూ ఉంటారు. తలను వెనుక నుంచి తిప్పి కాళ్ల మధ్యకు తీసుకురావడం వంటి ఫీట్లు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది కూడా. అలాంటి ఓ అమ్మాయే ఇంగ్లండ్ లోని పీటర్ బరో ప్రాంతానికి చెందిన లిబర్టీ బారోస్.
వయసు 14 ఏళ్లే అయినా..
లిబర్టీ బారోస్ శరీరం చాలా ప్రత్యేకం. కొన్నేళ్ల కిందటి నుంచి మెలిపెట్టడం మొదలుపెట్టింది. అలా మెల్లగా శరీరం మొత్తాన్ని ఎటు పడితే అటు వంచేసే సామర్థ్యం సంతరించుకుంది. తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఫ్లెక్సిబుల్ అమ్మాయిగా గిన్నిస్ బుక్ రికార్డు కూడా సృష్టించింది. తలను వెనక్కి తిప్పి కాళ్ల మధ్యగా తెచ్చి తన ఉదర భాగాన్ని నేలకు ఆన్చే ఫీట్ చేసింది. ఇలా కేవలం 30 సెకన్లలో పదకొండు సార్లు వంచి గిన్నిస్ బుక్ కు ఎక్కింది. సాధారణంగా మనుషులెవరూ ఇలా చేయలేరని గిన్నిస్ బుక్ ప్రతినిధులు పేర్కొనడం గమనార్హం.
ప్రత్యేక వెబ్ సైట్ తో ఇప్పటికే ఫేమస్..
శరీరాన్ని విభిన్నంగా వంచుతూ లిబర్టీ బారోస్ పలు ఫొటో షూట్లు కూడా చేసింది. తన పేరిటే ఒక ప్రత్యేకమైన వెబ్ సైట్ కూడా ఉంది. అందులో తన శరీరాన్ని స్ప్రింగుల్లా తిప్పేస్తూ చేసిన ఫీట్లకు సంబంధించిన ఫొటోలు కూడా పెట్టడం గమనార్హం. ఇప్పుడు కేవలం ప్రపంచ రికార్డును అధికారికంగా నమోదు చేసుకోవడం కోసం మాత్రమే.. గిన్నిస్ బుక్ వారి ముందు ఫీట్ చేసినట్టు లిబర్టీ తండ్రి రామ్ బారోస్ చెప్తున్నారు.