Congress: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక అనివార్యం!... ఈ నెల 17న పోలింగ్!
- కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ఖర్గే, థరూర్
- నేటితో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
- ఈ నెల 17న ఎన్నికలు నిర్వహిస్తామన్న మిస్త్రీ
- 19న ఓట్ల లెక్కింపు. ఆపై విజేతను ప్రకటిస్తామని వెల్లడి
కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం తర్వాత పార్టీ అధ్యక్ష ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. గాంధీ కుటుంబేతరులను పార్టీ అధ్యక్షులుగా చేయాలన్న పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మాటతో మొదలైన ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతోనే పూర్తి అవుతుందని అంతా భావించారు. అయితే పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్లు దాఖలు చేసిన మల్లికార్జున ఖర్గే, శశి థరూర్‌లలో ఏ ఒక్కరు కూడా తమ నామినేషన్ల ఉపసంహరణకు ముందుకు రాలేదు. ఫలితంగా పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు నిలిచినట్లైంది. వెరసి అధ్యక్ష ఎన్నికకు పోలింగ్ అనివార్యంగా మారింది.
ఈ మేరకు పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ శనివారం పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన కీలక ప్రకటన చేశారు. పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచారని, దీంతో ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌ను ఈ నెల 17న నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. పోలింగ్ తర్వాత ఈ నెల 19న ఢిల్లీలో ఓట్ల లెక్కింపును చేపట్టి అదే రోజు విజేతను ప్రకటిస్తామని తెలిపారు.