Karanam Dharmasri: విశాఖ రాజధానికి మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా
- అమరావతి రైతుల పాదయాత్రకు పోటీగా వైసీపీ ర్యాలీలు
- విశాఖ రాజధానికి మద్దతుగా జేఏసీ కూడా ఏర్పాటు
- అధికార వికేంద్రీకరణ కోసం రాజీనామా చేస్తున్నానన్న ధర్మశ్రీ
అమరావతే ఏపీ రాజధానిగా ఉండాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న పాదయాత్ర నేపథ్యంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రైతుల పాదయాత్రకు పోటీగా వైసీపీ శ్రేణులు ర్యాలీలను నిర్వహిస్తున్నాయి. విశాఖ రాజధానికి మద్దతుగా జేఏసీ కూడా ఏర్పాటయింది. ఈ జేఏసీ సమావేశం సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేశారు.
తన రాజీనామా లేఖను జేఏసీ కన్వీనర్ కు అందించారు. ఉత్తరాంధ్ర వ్యతిరేకులను రాజకీయంగా బహిష్కరించాలని చెప్పారు. అధికార వికేంద్రీకరణ కోసం తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఇదే సమయంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ఆయన సవాల్ విసిరారు. వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అచ్చెన్నాయుడికి దమ్ముంటే రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేశారు. అచ్చెన్నాయుడిపై పోటీ చేసేందుకు తాను సిద్ధమని చెప్పారు.