air pollutants: దారుణం.. తల్లి గర్భంలోని శిశువు ఊపిరితిత్తుల్లోనూ కాలుష్య కారకాలు
- కాలేయం, మెదడులోనూ గుర్తింపు
- యూకే, బెల్జియం శాస్త్రవేత్తల పరిశోధన
- తొలి మూడు నెలల్లోనే శిశువులను చేరుతున్న కాలుష్య కారకాలు
- నివారణ అవసరాన్ని గుర్తు చేసిన శాస్త్రవేత్తలు
మన చుట్టూ పరిసరాల్లో, గాలిలో కాలుష్యం ఏ స్థాయిలో పెరిగిపోయిందో చెప్పడానికి తాజా పరిశోధన ఒక నిదర్శనం కానుంది. వాయు కాలుష్యం కారకాలు గర్భంలోని శిశువులకూ చేరిపోతున్నట్టు ఇది గుర్తించింది. తల్లి గర్భంలో ఉన్న శిశువుల ఊపిరితిత్తులు, మెదడు, ఇతర అవయవాల్లో కాలుష్య కారకాలను పరిశోధకులు గుర్తించారు. మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే ఈ కాలుష్య కారకాలు మూడో నెలలోపే కనిపించడం.
విషపూరితమైన కాలుష్య కారకాలను నానో పార్టికల్స్ (కార్బన్) రూపంలో శిశువుల్లో గుర్తించారు. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళ వాయు కాలుష్యానికి గురికావడం వల్ల, అవి శిశువులను చేరుతున్నట్టు పరిశోధకులు తెలిపారు. గతంలోనూ బ్లాక్ కార్బన్ మోనో పార్టికల్స్ శిశువులను చేరడంపై పరిశోధనలు జరిగాయి. కాకపోతే ఇవి ప్లాసెంటా వరకు వెళుతున్నట్టు తెలుసుకున్నారు. శిశువుల్లోకి చేరుతున్నట్టు ఆధారాలు లభించలేదు. కార్బన్ మోనో పార్టికల్స్ శిశువును చేరుతున్నట్టు ప్రకటించిన తొలి వైద్య పరిశోధన ఇదే. ఈ పరిశోధన ఫలితాలు లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.
యూనివర్సిటీ ఆఫ్ అబర్డీన్ (యూకే), హాసెల్ట్ యూనివర్సిటీ (బెల్జియం) శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. మొదటి మూడు నెలల గర్భం సమయంలోనే కార్బన్ మోనో పార్టికల్స్ తల్లి ద్వారా ప్లాసెంటాకు చేరి, అక్కడి నుంచి శిశువులోని కాలేయం, ఊపిరితిత్తులు, మెదడులోకి చేరుతున్నట్టు ఈ పరిశోధన ప్రకటించింది. కనుక వాయు నాణ్యత పెంపునకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు సూచించారు.