Shiv Sena: పార్టీ నుంచి వెళ్లిపోయిన వారికి గుర్తు అడిగే హక్కు ఎక్కడిది?: ఎన్నికల సంఘంతో ఉద్ధవ్ థాక్రే
- స్వచ్చందంగా వెళ్లేవారికి పార్టీ పేరును, గుర్తును వాడుకునే హక్కు ఉండదని వ్యాఖ్య
- ఈసీ సూచన మేరకు తన అభిప్రాయాన్ని వెల్లడించిన ఉద్ధవ్ థాక్రే
- ఎన్నికల సంఘం తన వివరణను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి
మహారాష్ట్రలో శివసేన పార్టీ పేరు, గుర్తు విషయంలో జగడం కొనసాగుతూనే ఉంది. అసలైన శివసేన తమదంటే తమదంటూ ఉద్ధవ్ థాక్రే, ఏక్ నాథ్ షిండే వర్గాలు వాదిస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల సంఘానికి ఏక్ నాథ్ షిండే వర్గం దరఖాస్తు చేసుకోగా.. ఉద్ధవ్ వర్గం మాత్రం తమదే శివసేన అని స్పష్టం చేస్తోంది. దీనికి సంబంధించి ఉద్ధవ్ థాక్రే తాజాగా ఎన్నికల సంఘానికి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
శివసేన, విల్లు–బాణం కోసం పోరు
మహారాష్ట్ర ప్రజల్లో శివసేన పార్టీకి, ఆ పార్టీ గుర్తు విల్లు, బాణానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు, ప్రభుత్వం కుప్పకూలడం, షిండే వర్గం బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉద్ధవ్, ఏక్ నాథ్ షిండే వర్గాలు వీటికోసం పోరాడుతున్నాయి. ఈ క్రమంలో అభిప్రాయం చెప్పాల్సిందిగా ఎన్నికల సంఘం ఉద్ధవ్ థాక్రేను కోరింది.
వారు స్వచ్చందంగా వెళ్లిపోయారు
ఈసీ సూచనపై స్పందించిన ఉద్ధవ్.. ‘‘పార్టీ నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోయే వారికి పార్టీ పేరుగానీ, పార్టీ గుర్తుగానీ అడిగే హక్కు ఉండదు. ఏక్ నాథ్ షిండే, తన అనుచరులు స్వచ్చందంగా శివసేన నుంచి బయటికి వెళ్లిపోయారు. వారు శివసేనను వద్దనుకున్నారు. అందువల్ల వారికి పార్టీ పేరును, గుర్తును వాడుకునే హక్కు ఉండదు.. ఎన్నికల సంఘం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి..” అని వివరించారు.