Mulugu District: పాత కరెన్సీని స్వామీజీ కొత్తనోట్లుగా మారుస్తాడని ప్రచారం.. రూ.1.65 కోట్ల పాతనోట్ల పట్టివేత!

Rs 2 crore worth old currency seized in Mulugu District

  • అప్పుల్లో మునిగిపోయిన నిందితుడు
  • తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించే మార్గం కోసం వెతుకులాట
  • యూపీలోని స్వామీజీ పాత కరెన్సీని కొత్త నోట్లుగా మారుస్తాడన్న స్నేహితుడు
  • అతడి మాటలు నమ్మి రూ. 5 లక్షలు చెల్లించి  రూ. 2 కోట్ల విలువైన పాత కరెన్సీ, దొంగ నోట్ల కొనుగోలు
  • హైదరాబాద్ వస్తుండగా పోలీసులకు పట్టుబడిన వైనం

రద్దయిన పాతనోట్లను ఓ స్వామీజీ కొత్త కరెన్సీగా మారుస్తాడని నమ్మి రూ. 1.65 కోట్లు తరలిస్తున్న ముఠాను ములుగు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా కేశవాపూర్‌కు చెందిన పప్పుల నాగేంద్రబాబు అప్పుల పాలు కావడంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే వ్యాపారం చేయాలని భావించాడు. ఈ క్రమంలో తన స్నేహితుడైన కోదాడ మండలం సాలర్జింగ్‌పేటకు చెందిన శ్రీరాముల నాగేశ్వరరావు అలియాస్ నగేశ్‌ను కలిసి విషయం చెప్పాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాబా పాత కరెన్సీని కొత్త నోట్లుగా మారుస్తాడని నాగేంద్రబాబును నగేష్ నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన నాగేంద్రబాబు హైదరాబాద్‌కు చెందిన వెంకటరెడ్డి, నవీన్‌రెడ్డికి రూ. 5 లక్షలు ఇచ్చి వారి నుంచి దాదాపు రూ. 2 కోట్ల విలువైన రద్దయిన పాత కరెన్సీ, దొంగనోట్లను కొనుగోలు చేశాడు. 

ఆ సొమ్ము తీసుకుని భద్రాచలం నుంచి వెంకటాపురం మీదుగా హైదరాబాద్ తరలిస్తుండగా వాహన తనిఖీల్లో పట్టుబడ్డారు. వారి నుంచి పాత కరెన్సీ, దొంగ నోట్లు, రెండు కార్లు, 9 ఫోన్లు, రూ. 5 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నాగేంద్రబాబు, నాగలింగేశ్వరరావుతోపాటు భద్రాచలం ఏఎంసీ కాలనీకి చెందిన మారె సాంబశివరావు, ములుగు జిల్లా వెంకటాపురానికి చెందిన బెజ్జంకి సత్యనారాయణ, నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఎక్కనాడే గ్రామానికి చెందిన వడ్డి శివరాజ్, హైదరాబాద్ ఉప్పల్ బుద్ధానగర్‌కు చెందిన ఆయుర్వేద వైద్యుడు గంటా యాదగిరి, మలక్‌పేట బ్యాంక్ కాలనీకి చెందిన ఠాకూర్ అజయ్‌సింగ్, చత్తీస్‌గఢ్‌కు చెందిన ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Mulugu District
Venkatapur
Old Currency
New Currency
  • Loading...

More Telugu News