Smoking: ధూమపానాన్ని మానుకోలేకపోతున్నారా?.. మీకు ఇన్ఫెక్షన్ల ముప్పు ఉన్నట్టే!
- ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం పొగతాగే వారిలో 12 శాతం అధికం
- శ్వాసకోస సంబంధిత అనారోగ్యం బారినపడే అవకాశం 48 శాతం ఎక్కువ
- అలవాటు మానుకోకుంటే ముప్పు తప్పదని హెచ్చరిక
ధూమపానాన్ని మానుకోలేకపోతున్నారా? అయితే, మీరు ఇబ్బందుల్లో పడినట్టే. ఈ అలవాటు ఉన్న వారికి కరోనా సహా ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల ముప్పు పొంచి ఉన్నట్టు తేలింది. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధనలో ఈ విషయం తేలింది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే ధూమపానం చేసేవారికి ఇన్ఫెక్షన్లు సోకే ముప్పు 12 శాతం అధికంగా ఉన్నట్టు గుర్తించారు.
అలాగే, వీరు శ్వాసకోస సంబంధిత అనారోగ్యం బారినపడే అవకాశాలు 48 శాతం ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. పొగతాగేవారు వెంటనే తమ అలవాటును మానుకోవాలని తమ పరిశోధన నొక్కి చెబుతోందని పరిశోధకులు తెలిపారు. కాగా, పొగ తాగే వ్యక్తుల్లో కొవిడ్ తీవ్రత ముప్పు ఎక్కువగా ఉంటుందని గతంలోనూ పలు అధ్యయనాలు వెల్లడించాయి. తాజా, పరిశోధనతో అది మరోమారు రుజువైంది.