Andhra Pradesh: ఏపీకి మరో రెండ్రోజుల పాటు వర్ష సూచన
- బలహీనపడిన అల్పపీడనం
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- రాష్ట్రంలో రేపు, ఎల్లుండి విస్తారంగా వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినప్పటికీ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కాగా, రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సంస్థ ఎండీ అంబేద్కర్ తెలిపారు.
రేపు (అక్టోబరు 7) రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఎల్లుండి (అక్టోబరు 8) రాయలసీమ, ఉత్తరాంధ్రలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్ష సూచన ఉన్న జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు తెలిపారు.