Madhya Pradesh: వృద్ధుడి పొట్టలో గ్లాసు.. చూసి నిర్ఘాంతపోయిన వైద్యులు.. అది లోపలికి ఎలా వెళ్లిందంటే..?
- మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లాలో ఘటన
- వృద్ధుడిని కొట్టి గ్లాసుపై కూర్చోబెట్టిన గ్రామస్థులు
- ప్రమాదవశాత్తు లోపలికి వెళ్లిపోయిన గ్లాసు
- కడుపు నొప్పి వేధిస్తుండడంతో ఆసుపత్రికి వెళ్లడంతో వెలుగులోకి
చిన్న పిల్లలు కనిపించినవన్నీ మింగేస్తుంటారు. ఇది చాలా సర్వసాధారణమైన విషయం. ఇటీవల ఓ వ్యక్తి కడుపులో ఏకంగా చెంచాల గుట్ట కనిపించింది. అది చూసి ఆశ్చర్యపోవడం వైద్యుల వంతైంది. స్పూన్లు కాబట్టి పొరపాటునో, గ్రహపాటునో కడుపులోకి వెళ్లాయని అనుకోవచ్చు. అయితే, ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం వాటికి పూర్తిగా భిన్నమైనది. ఓ వృద్ధుడి పొట్టలో ఏకంగా గ్లాసు కనిపించడంతో వైద్యులు నిర్ఘాంతపోయారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లాలో జరిగిందీ ఘటన.
నాలుగు నెలల క్రితం రామ్‌దాస్ అనే వృద్ధుడు అమావత్ అనే గ్రామానికి వెళ్లాడు. అతడిని పట్టుకుని దారుణంగా కొట్టిన గ్రామస్థులు ఆపై అతడిని ఓ గ్లాసుపై కూర్చోబెట్టారు. అందరి సమక్షంలో బహిరంగంగానే ఈ ఘటన జరిగినప్పటికీ ఎవరూ అడ్డుకోలేదు. ఈ క్రమంలో కూర్చున్న వృద్ధుడి పొట్టలోకి గ్లాసు జారుకుంది. అయితే, గ్రామస్థులు అతడిపై ఎందుకు దాడిచేశారన్న విషయం తెలియరాలేదు. మరోవైపు, బాధిత వృద్ధుడు రామ్‌దాస్ ఈ విషయాన్ని సిగ్గుతో బయటపెట్టలేదు. ఘటన జరిగిన నాలుగు నెలల తర్వాత కడుపులో తరచూ విపరీతమైన నొప్పి వస్తుండడంతో చతుఖేడ చేరుకుని గ్రామస్థులకు విషయం చెప్పాడు. వారు అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు ఎక్స్‌రే తీయగా పొట్టలో గ్లాసు కనిపించడంతో వైద్యులు షాకయ్యారు. వృద్ధుడికి ఆపరేషన్ చేసి గ్లాసును వెలికి తీస్తామని వైద్యులు తెలిపారు.