Jairam Ramesh: కేసీఆర్ కు వీఆర్ఎస్ తప్పదు.. రాహుల్ పీఎం అయితే ఏపీకి ప్రత్యేక హోదాపై తొలి సంతకం: జైరాం రమేశ్

KCR must have VRS says Jairam Ramesh

  • తెలంగాణకు ఏమీ చేయలేని కేసీఆర్ జాతీయ స్థాయిలో ఏం చేస్తారన్న జైరాం రమేశ్
  • ఏపీకీ బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని విమర్శ
  • ఏపీలో రాహుల్ పాదయాత్ర 85 కి.మీ. మేర ఉంటుందని వ్యాఖ్య

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. రేపు దసరా సందర్భంగా ఆయన జాతీయ పార్టీపై కీలక ప్రకటన చేయబోతున్నారు. మరోవైపు, జాతీయ పార్టీ పేరు 'బీఆర్ఎస్' అనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ కాదు, కేసీఆర్ కు వీఆర్ఎస్ (వాలంటరీ రిటైర్మెంట్) తప్పదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఏమీ చేయలేని కేసీఆర్... జాతీయ స్థాయిలో ఏం చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏపీలోకి రానున్న నేపథ్యంలో... కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించిందని... తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదాను ఇస్తామని బీజేపీ ప్రకటించిందని... ఇంతవరకు హోదా ఇవ్వలేదని జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా ఫైల్ మీదే పెడతారని చెప్పారు. ఈ నెల 18న కర్నూలు జిల్లా ఆలూరుకు పాదయాత్ర చేరుకుంటుందని తెలిపారు. ఏపీలో రాహుల్ యాత్ర 85 కిలోమీటర్ల మేర నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణకు వెళ్తుందని తెలిపారు. 120 మంది రాహుల్ యాత్రలో పాల్గొంటున్నారని... అందులో మూడో వంతు మహిళలు ఉన్నారని చెప్పారు.

Jairam Ramesh
Rahul Gandhi
Padayatra
Andhra Pradesh
KCR
TRS
  • Loading...

More Telugu News