sculpture: బెంగళూరు రైల్వే స్టేషన్ లో ఈ నిర్మాణం.. ప్రధానిని కదిలించింది!
- ప్లాస్టిక్ వేస్ట్ బాటిళ్లతో భూమాత విగ్రహం తయారీ
- కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు
- ఈ తరహా ప్రయత్నాలు ప్రశంసనీయమన్న ప్రధాని
బెంగళూరు రైల్వే స్టేషన్ లో ఓ విగ్రహం ప్రయాణికులను ఎంతో ఆకర్షిస్తోంది. విషయం ఏమిటంటే ప్లాస్టిక్ ఖాళీ వాటర్ బాటిళ్లతో ఇక్కడ భూమాత విగ్రహాన్ని తయారు చేసి ఏర్పాటు చేశారు. దానిపై ‘నన్ను కాపాడండి’ అని రాసి ఉంది. ప్రజల్లో పర్యావరణం పట్ల అవగాహన కల్పించేందుకు సౌత్ వెస్టర్న్ రైల్వే దీన్ని ఏర్పాటు చేసింది.
ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నేడు ఒక పెద్ద సవాలుగా మారిపోయింది. ముఖ్యంగా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ వ్యర్థాలు మరీ ఎక్కువ. ఈ వ్యర్థాలను తగ్గించేందుకు, ప్రజల్లో అవగాహన కోసం సౌత్ వెస్టర్న్ రైల్వే బెంగళూరులోని పలు రైల్వే స్టేషన్లలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్రాంతి వీర సంగోలి రాయన్న (కేఎస్ఆర్) రైల్వే స్టేషన్ సిబ్బంది ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి విగ్రహం మాదిరిగా తయారు చేశారు.
ఈ ప్రయత్నం ప్రధాని మోదీని సైతం కదిలించింది. ‘‘ఈ తరహా ప్రయత్నాలు వినూత్నమైనవే కాదు.. ప్రశంసనీయమైనవి. మన పరిసరాలు, బహిరంగ ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన పౌరుల కనీస బాధ్యతను గుర్తు చేస్తోంది’’అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.