Ukraine: ఎలన్ మస్క్, జెలెన్ స్కీ మధ్య ట్వీట్ల వార్
- ఉక్రెయిన్- రష్యా మధ్య శాంతి సూచన చేసిన మస్క్
- రష్యా ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాల్లో రెఫరెండం పెట్టాలన్న టెస్లా అధినేత
- క్రిమియా రష్యాలో భాగమని వ్యాఖ్య
- తీవ్రంగా స్పందిస్తున్న ఉక్రేనియన్లు
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ముగించే విషయంలో సోషల్ మీడియా వేదికగా పలు సూచనలు చేసిన టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఆ దేశ అధికారులతో తిట్లు తిన్నారు. ఈ విషయంలో మస్క్, ఉక్రెయిన్ అధికారుల మధ్య సోషల్ మీడియాలో అసహ్యకరమైన వాగ్వాదం నడిచింది. గత వారం రష్యా ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాల్లో ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని మస్క్ ట్వీట్ చేశారు. 1783 నుంచి క్రిమియా అధికారికంగా రష్యాలో భాగమని, క్రిమియాకు నీటి సరఫరాకు హామీ ఇవ్వాలని.. ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలని అన్నారు. ఈ విషయంపై తన ట్విట్టర్ ఖాతాలో పోల్ కూడా నిర్వహించారు.
ఇది ఉక్రెయిన్లకు రుచించలేదు. స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. మస్క్‌కు కౌంటర్ ఇచ్చారు. "మీకు ఏ ఎలన్ మస్క్ అంటే ఎక్కువ ఇష్టం?” అంటూ పోల్ నిర్వహించారు. ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చేవాడు అంటూ ఒక ఆప్షన్.. రష్యాకు మద్దతు ఇచ్చేవాడు అంటూ రెండో ఆప్షన్ ఇచ్చారు. జర్మనీలోని కీవ్ రాయబారి ఆండ్రీ మెల్నిక్.. బూతు పదాన్ని వాడి మస్క్‌కు ఇదే తన దౌత్యపర సమాధానం అని ట్వీట్ చేశారు.
తన ట్వీట్‌పై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో మస్క్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా తన పూర్తి సైన్యాన్ని మోహరించే అవకాశం ఉందని, ఇది పూర్తి యుద్ధానికి దారి తీస్తుందన్నారు. రష్యాకు పెద్ద జనాభా ఉంది కాబట్టి రెండు వైపులా భారీ ప్రాణ నష్టం జరగవచ్చన్నారు. "మొత్తం యుద్ధంలో ఉక్రెయిన్ విజయం అసంభవం. మీకు ఉక్రెయిన్ ప్రజల పట్ల శ్రద్ధ ఉంటే శాంతిని కోరండి” అని మస్క్ ట్విట్ చేశారు.