Hyderabad: రేపటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో అతి భారీ వర్షాలు!
- బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు
- తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక
- తమిళనాడులో నేడు అతి భారీ వర్షం కురిసే అవకాశం
హైదరాబాద్ సహా తెలంగాణలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. రేపటి నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి తోడు ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో మరో ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణశాఖ తెలిపింది.
వీటి ప్రభావంతో మంగళవారం నుంచి మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు, దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ప్రజలను కష్టాలపాటు చేస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోనూ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు.
కాగా, ఏపీ సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తమిళనాడులో నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణశాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.