Snake: రాత్రి పూట.. ఒక్కడే అంత పెద్ద పామును పట్టి పడేశాడు.. వైరల్ వీడియో ఇదిగో
- రాత్రిపూట అడవిలోని రోడ్డుకు అడ్డంగా పడుకున్న కొండ చిలువ
- వాహనంలోంచి దిగి వెళ్లి ఉత్త చేతులతోనే పామును పట్టి లాగేసిన వ్యక్తి
- వీడియో షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాశ్వాన్
- వాహనాల కింద పడకుండా ధైర్యంగా పామును కాపాడాడంటూ వీడియోలోని వ్యక్తికి ప్రశంసలు
అదో చిన్నపాటి అటవీ ప్రాంతం.. ఆ మార్గం నుంచి కొందరు ఓ వాహనంలో వెళుతున్నారు. మధ్యలో ఓ పెద్ద కొండ చిలువ. రోడ్డుకు అడ్డంగా పడుకుని ఉంది. దాని జోలికి వెళితే మన పని అంతే అన్నంత పెద్దగా ఉంది. సాధారణంగా హారన్ కొట్టడం, కాస్త దగ్గరగా వాహనాన్ని తీసుకెళ్లడం వంటి చేస్తే రోడ్డు మీద నుంచి పాము వెళ్లిపోతుంది. కానీ అలా చేసినా ఆ కొండ చిలువ అలాగే పడుకుని ఉంది. ఇంతలో వాహనంలోంచి ఓ వ్యక్తి ధైర్యంగా దిగి కొండ చిలువ దగ్గరికి వెళ్లాడు.
ఉత్త చేతులతో పట్టుకుని..
దాని తోక భాగం వైపు వెళ్లిన వ్యక్తి.. కర్ర వంటిదేమీ లేకుండా ఉత్త చేతులతోనే కొండ చిలువను పట్టుకుని లాగేయడం మొదలుపెట్టాడు. వాహనంలోని వారు వద్దు వద్దని గట్టిగా అరుస్తున్నా వెనక్కి తగ్గలేదు. తోక పట్టుకోగానే కొండ చిలువ ఒక్కసారిగా ఆ వ్యక్తి వైపు వెనక్కి తిరిగింది. కరవడానికి సిద్ధమైంది. అయినా అతను భయపడలేదు. తోక పట్టుకుని గట్టిగా లాగి రోడ్డు పక్కకు పడేశాడు. ఆ వెంటనే కొండ చిలువ వేగంగా పొదల్లోకి పారిపోయింది.
వీడియో షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి
- ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కాశ్వాన్ ఈ వీడియోను షేర్ చేశారు. ‘‘దక్షిణ భారత దేశంలోని ఓ వ్యన్యప్రాణి అభయారణ్యంలో తీసిన వీడియో ఇది. వన్యప్రాణులు ఉండే చోటికి వెళ్లినప్పుడు.. వాటిని డిస్టర్బ్చేయకుండా, రోడ్డు ప్రమాదానికి లోను కాకుండా కాపాడారు.” అని క్యాప్షన్ పెట్టారు.
- ఇటీవల విదేశాల నుంచి చీతాలను తెచ్చి వదిలిన నేపథ్యంలో.. ఒకనాడు దేశంలో చీతాలను వేటకుక్కల్లా పెంచుకునే వారంటూ పర్వీన్ కాశ్వాన్ విడుదల చేసిన వీడియోలో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆయనే ఎవరో ఈ పామును రోడ్డు పై నుంచి పక్కకు లాగేసిన వీడియోను షేర్ చేశారు.
- ఈ వీడియోకు వేల కొద్దీ వ్యూస్, పెద్ద సంఖ్యలో లైకులు వస్తున్నాయి. పాముపై నుంచి వాహనాలు వెళితే చనిపోకుండా రక్షించడం చాలా బాగుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
- ‘వామ్మో అలా చేత్తో అంత పెద్ద పామును పట్టుకుని జరపడం ఏమిటి?’ అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. ‘‘తాను మంచిపనే చేశాడని, కానీ మరీ ఎక్కువ రిస్క్ తీసుకున్నట్టు ఉంది. ఏదైనా కర్రతో కదిపితే సరిపోయేది” అని మరికొందరు పేర్కొంటున్నారు.