Ukraine: తమ భూభాగాలను రష్యా కలిపేసుకోవడంపై ఉక్రెయిన్ స్పందన... వెంటనే తమను నాటోలో చేర్చుకోవాలని విజ్ఞప్తి
- గత ఏడు నెలలుగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు
- తాజాగా నాలుగు ప్రాంతాలపై తమదే అధికారం అని ప్రకటన
- రష్యా భూభాగాన్ని విస్తరిస్తూ పుతిన్ శాసనం
- నాటోలో చేరిక ప్రక్రియ వేగవంతం చేయాలన్న జెలెన్ స్కీ
జపోర్జియా, ఖేర్సన్, లుహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాలు ఇక తమవేనంటూ రష్యా ప్రకటించుకోవడం పట్ల ఉక్రెయిన్ స్పందించింది. నాటోలో ఉక్రెయిన్ కు సభ్యత్వం అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ విజ్ఞప్తి చేశారు.
నాటో కూటమిలో చేరేందుకు తమ అర్హతలను ఇదివరకే నిరూపించుకున్నామని జెలెన్ స్కీ ఓ వీడియో ద్వారా వెల్లడించారు. నాటోలో చేరిక ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలంటూ ఉక్రెయిన్ తరఫున దరఖాస్తును పంపుతున్నామని తెలిపారు. పుతిన్ అధికారంలో ఉన్నంతకాలం రష్యాతో తాము చర్చలు జరపబోమని జెలెన్ స్కీ స్పష్టం చేశారు. రష్యాకు కొత్త అధ్యక్షుడు వస్తేనే తాము ఆ దేశంతో చర్చలు జరుపుతామని ఉద్ఘాటించారు.