Hyderabad: హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్... ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేస్తే రూ.1000 జరిమానా
![new traffic rules in hyderabad soon](https://imgd.ap7am.com/thumbnail/cr-20220930tn6337001b0ef09.jpg)
- స్టాప్ లైన్ దాటితే రూ.100 ఫైన్
- పాదచారులకు అడ్డంగా వాహనాలు నిలిపితే రూ.600 జరిమానా
- ఫుట్‌పాత్‌లపై వస్తువులు పెట్టే దుకాణదారులకూ జరిమానాల వడ్డన
హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ పోలీసులు సరికొత్త నిబంధనలను అమలు చేయనున్నారు. ఇప్పటిదాకా లైసెన్స్ లేకున్నా, హెల్మెట్ లేకున్నా, కారులో సీటు బెల్ట్ పెట్టుకోకున్నా, మితి మీరిన వేగంతో దూసుకెళ్లినా, నో పార్కింగ్ జోన్‌లో వాహనాలు నిలిపినా... జరిమానాలు విధించిన ట్రాఫిక్ పోలీసులు ఇకపై సరికొత్త నిబంధనలు అమలులోకి తీసుకురానున్నారు. ఈ కొత్త నిబంధనలు అతిక్రమించినా జరిమానాలు విధించే దిశగా చర్యలు చేపట్టనున్నారు.
కొత్త నిబంధనల్లో భాగంగా ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనదారులు నిర్దేశిత నిబంధనలు పాటించాల్సిందేనని ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. సిగ్నళ్ల వద్ద స్టాప్ లైన్ దాటితే రూ.100 జరిమానా విధించనున్నారు. అదే సమయంలో సిగ్నళ్ల వద్ద ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేస్తే ఏకంగా రూ.1,000 జరిమానా విధించనున్నారు. ఇక పాదచారులకు అడ్డంగా వాహనాలు నిలిపే వారికి రూ.600 జరిమానా విధించనున్నారు. ఫుట్‌పాత్‌లపై వస్తువులు పెట్టే దుకాణదారులపైనా భారీగా జరిమానాలు విధించేందుకు ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఈ నిబంధనలు ఎప్పటి నుంచి అమలులోకి తీసుకొస్తారన్నది తెలియరాలేదు.