Digvijay Singh: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన మరో సీనియర్ నేత
- నామినేషన్ పేపర్లు తీసుకున్న దిగ్విజయ్ సింగ్
- నామినేషన్ వేయడానికి రేపే చివరి రోజు
- బరిలో నిలిచిన దిగ్విజయ్, శశిథరూర్
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మరో సీనియర్ నేత పోటీ చేయనున్నారు. ఎన్నికల బరిలోకి దిగ్విజయ్ సింగ్ దిగారు. తాను అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్టు డిగ్గీ రాజా తెలిపారు. నామినేషన్ పేపర్లను తీసుకోవడానికి వచ్చానని ఆయన చెప్పారు. రేపు నామినేషన్ దాఖలు చేస్తానని అన్నారు. నామినేషన్ వేయడానికి రేపే చివరి రోజు కావడం గమనార్హం. అక్టోబర్ 17న ఎన్నిక జరగనుంది.
మరోపక్క, ఎన్నికల బరి నుంచి అశోక్ గెహ్లాట్ తప్పుకున్నట్టు వార్తలొచ్చాయి. దీంతో, శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ మధ్యే పోటీ జరగనుంది. శశిథరూర్ కూడా రేపే నామినేషన్ వేయనున్నారు. అశోక్ గెహ్లాట్ మాదిరే దిగ్విజయ్ సింగ్ కు కూడా ఎన్నో ఏళ్లుగా గాంధీ కుటుంబానికి నమ్మకస్తుడిగా ఉన్నారు.
మరోవైపు అశోక్ గెహ్లాట్ కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికీ కొందరు నేతలు భావిస్తున్నారు. ఈరోజు సోనియాగాంధీతో భేటీ అయిన తర్వాత ఆయన తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే, ఇంతవరకు గెహ్లాట్ కు సోనియా అపాయింట్ మెంట్ దొరకలేదు.