TTD: తిరుమల శ్రీవారి స్నపన తిరుమంజనం కోసం జపాన్ నుంచి ఆపిల్స్, మస్కట్ నుంచి ద్రాక్ష
- నిన్న ప్రారంభమైన సాలకట్ల బ్రహ్మోత్సవాలు
- నేడు హంసవాహనంపై స్వామివారు
- తిరుమాడ వీధుల్లో విహారం
- స్వామివారికి స్నపనం నిర్వహించిన అర్చకులు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. నేటి సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తి హంస వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. అందుకోసం జపాన్ నుంచి ఆపిల్స్, మస్కట్ నుంచి ద్రాక్ష, కొరియా నుంచి పియర్స్ పండ్లు తెప్పించినట్టు టీటీడీ వెల్లడించింది. స్వామివారి ప్రత్యేక అలంకరణ కోసం ఒక టన్ను కట్ ఫ్లవర్స్, పండ్లు వినియోగించినట్టు వివరించింది.
బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన 2, 3, 4, 9వ దినాల్లో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఉత్సవాల్లో చోటుచేసుకునే దోష నివారణ నిమిత్తం ఈ క్రతువు చేపడతారు. ఇందులో ప్రధానంగా పసుపు నీళ్లతోనూ, కొబ్బరి నీరు, తేనె, వివిధ సుగంధ ద్రవ్యాలతోనూ స్వామివారికి అభిషేకం చేస్తారు. స్వామివారిని, దేవేరులను తులసిమాలలతో అలంకరిస్తారు.