TTD: టీటీడీలో బ్రాహ్మణ వ్యతిరేక శక్తులు ఉన్నాయి: రమణ దీక్షితులు
- తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడుగా కొనసాగుతున్న రమణ దీక్షితులు
- సీఎం జగన్ తిరుమల పర్యటన నిరాశపరచిందని వ్యాఖ్య
- వంశపారంపర్య అర్చక వ్యవస్థపై కమిటీ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్
తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం తిరుమల పర్యటన తనను నిరాశకు గురి చేసిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా టీటీడీలో బ్రాహ్మణ వ్యతిరేక శక్తులు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రమణ దీక్షితులు పోస్ట్ చేసిన ఓ ప్రకటన వివాదాస్పదంగా మారింది.
తిరుమల పర్యటనలో భాగంగా వంశపారంపర్య అర్చక వ్యవస్థపై నియమించిన ఏకసభ్య కమిటీ సమర్పించిన నివేదికపై జగన్ స్పందిస్తారని తామంతా ఆశించామని రమణ దీక్షితులు అన్నారు. అయితే ఆ దిశగా సీఎం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం తమను నిరాశకు గురి చేసిందని అయన అన్నారు. ఈ సందర్భంగా టీటీడీపై విమర్శలు గుప్పించిన దీక్షితులు.. అర్చక వ్యవస్థను టీటీడీ నాశనం చేసేలోగానే జగన్ స్పందించాలని కోరారు. వంశపారంపర్య అర్చక వ్యవస్థపై కమిటీ సిఫారసులను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.