Abortion: భార్య అబార్షన్ చేయించుకోవాలనుకుంటే భర్త అనుమతి అవసరంలేదు: కేరళ హైకోర్టు
- ప్రేమ వివాహం చేసుకున్న యువతి
- గర్భం దాల్చాక భర్త అనుమానాలు
- పుట్టింటికి వెళ్లిపోయిన యువతి
- అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయం
- భర్తతో విడిపోయినట్టు ఆధారాలు చూపాలన్న క్లినిక్
వివాహిత మహిళ అబార్షన్ విషయంలో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య గర్భాన్ని తొలగించుకోవాలనుకుంటే అందుకు భర్త అనుమతి అవసరంలేదని పేర్కొంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అబార్షన్ కు అనుమతి ఇవ్వాలంటూ కొట్టాయంకు చెందిన ఓ యువతి (21) కేరళ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఈ మేరకు స్పష్టం చేసింది.
ఆమె పెద్దలకు ఇష్టంలేని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత భర్త, అత్త నిజస్వరూపం ప్రదర్శించారు. ఆమె గర్భవతి కాగా, ఆమె ప్రవర్తనపై అతడు అనుమానాలు వ్యక్తం చేసేవాడు. అత్త కూడా వేధించసాగింది. దాంతో ఆమె పుట్టింటికి చేరింది.
అయితే కడుపులో పెరుగుతున్న పిండాన్ని తొలగించేందుకు ఓ క్లినిక్ కు వెళ్లగా, భర్తతో విడిపోయినట్టు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ, అబార్షన్ కు తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆమె పరిస్థితిని లోతుగా పరిశీలించిన కేరళ హైకోర్టు కొట్టాయం మెడికల్ కాలేజి, లేదా ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో గానీ అబార్షన్ చేయించుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పు ఆమె జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని, కాపురం కొనసాగించేందుకు భర్త ఎలాంటి ఆసక్తి చూపించలేదని కోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో, ఆమె అబార్షన్ కు భర్త అనుమతి అవసరంలేదని కీలక తీర్పు వెలువరించింది.