Team India: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్న టీమిండియా
- ఆసీస్ పై 2-1తో సిరీస్ కైవసం
- టీమిండియాకు, ఇంగ్లండ్ కు మధ్య 7 పాయింట్ల అంతరం
- త్వరలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్
- గెలిస్తే టీమిండియా నెంబర్ స్థానం మరింత పదిలం
రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను 2-1తో నెగ్గిన టీమిండియా తన ఖాతాలో రేటింగ్ పాయింట్ల సంఖ్యను పెంచుకుంది. టాప్ లో ఉన్న టీమిండియాకు, రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ కు మధ్య 7 రేటింగ్ పాయింట్ల అంతరం ఉంది. గత ర్యాంకింగ్స్ సమయంలో ఆ తేడా 1 పాయింట్ గా ఉంది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 268 రేటింగ్ పాయింట్లు ఉండగా, ఇంగ్లండ్ ఖాతాలో 261 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
ఇక, ఈ తాజా ర్యాంకింగ్స్ జాబితాలో దక్షిణాఫ్రికా (258), పాకిస్థాన్ (258), న్యూజిలాండ్ (252), ఆస్ట్రేలియా (250), వెస్టిండీస్ (241), శ్రీలంక (237), బంగ్లాదేశ్ (224), ఆఫ్ఘనిస్థాన్ (219) టాప్-10లో నిలిచాయి. కాగా, వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియా సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. సెప్టెంబరు 28, అక్టోబరు 2, 4 తేదీల్లో టీ20లు జరగనున్నాయి. ఈ సిరీస్ ను కూడా టీమిండియా చేజిక్కించుకుంటే, ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా నెంబర్ వన్ స్థానం మరింత పదిలం అవుతుంది.