Telugu Cine Patrikeya Charitra: 'తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర' పోస్టర్ ని ఆవిష్కరించిన సూపర్ స్టార్ కృష్ణ, బ్రహ్మానందం

Superstar Krishna and Brahmanandam unveils Telugu Cine Patrikeya Charitra poster

  • సినిమా జర్నలిస్టుల చరిత్రపై పుస్తకం
  • తొలినాళ్ల నుంచి ఇప్పటివరకు జర్నలిస్టుల వివరాలతో పుస్తకం
  • వచ్చే నెలలో పుస్తకం రిలీజ్
  • పుస్తకం విజయవంతం కావాలన్న కృష్ణ, బ్రహ్మానందం

సీనియర్ ఫిలిం జర్నలిస్టు యు.వినాయకరావు సినిమా జర్నలిస్టుల చరిత్రను అక్షరబద్ధం చేస్తూ తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర పుస్తకాన్ని రచించారు. ఇందులో తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి వచ్చిన సినీ పత్రికలు, పాత్రికేయుల వివరాలు పొందుపరిచారు. టాలీవుడ్ తొలినాళ్ల నుంచి వివిధ జర్నలిస్టులు సినీ రంగ అభివృద్ధికి చేసిన కృషిని వివరించారు. ఆయా జర్నలిస్టుల వివరాలు పేరుపేరునా వెల్లడించారు. 

ఈ పుస్తకం ఫస్ట్ లుక్ పోస్టర్ ను సూపర్ స్టార్ కృష్ణ, ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం వేర్వేరుగా ఆవిష్కరించారు. ఈ పుస్తకం 500 పేజీలతో రూపుదిద్దుకుంది. వచ్చే నెలలో ఈ పుస్తకం విడుదల కానుంది. 

పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ, సినీ జర్నలిస్టుగా వినాయకరావు అందరికీ తెలిసిన వ్యక్తి అని, ఆయన గతంలో ఎన్టీఆర్, దాసరి నారాయణరావు, రామానాయుడు వంటివారిపై పుస్తకాలు రాశారని తెలిపారు. అంతేకాకుండా, 'దేవుడు లాంటి మనిషి' పేరుతో నా సినిమా కెరీర్ పైనా పుస్తకం రాశారు అని కృష్ణ వెల్లడించారు. తాజాగా సినిమా జర్నలిస్టుల చరిత్రను పుస్తక రూపంలో తీసుకువస్తున్నారని, వినాయకరావు ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. 

అటు బ్రహ్మానందం మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమకు 84 ఏళ్ల చరిత్ర ఉందని, ఇంతటి సుదీర్ఘ చరిత్రను పుస్తక రూపంలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేయడం నిజంగా సాహసమేనని అన్నారు. ఎంతోమంది జీవితచరిత్రలు పుస్తకరూపంలో తీసుకువచ్చిన వినాయకరావుకు ఇది సాధ్యమేనని పేర్కొన్నారు.

More Telugu News