Virat Kohli: 'ఆట గొప్పతనం ఇదే'నంటూ ఫెదరర్, నాదల్ ఏడుస్తున్న ఫొటోను షేర్ చేసిన కోహ్లీ
- కెరీర్ కు వీడ్కోలు పలికిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్
- నిన్న రాత్రి నాదల్ తో కలిసి లేవర్ కప్ లో డబుల్స్ ఆడిన రోజర్
- వీడ్కోలు వేళ ఫెదరర్ భావోద్వేగం.. కన్నీళ్లు పెట్టుకున్న నాదల్
- తాను చూసిన అందమైన క్రీడా చిత్రం ఇదేనన్న విరాట్ కోహ్లీ
స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన కెరీర్ కు వీడ్కోలు పలికాడు. లేవర్ కప్ లో భాగంగా నిన్న రాత్రి తన చివరి ఏటీపీ మ్యాచ్ ఆడాడు. కెరీర్లో ఆఖరి ఆటను చిరకాల ప్రత్యర్థి, స్నేహితుడు రఫెల్ నాదల్ తో కలిసి ఆడాడు. యూరప్ టీమ్ తరఫున డబుల్స్ లో ఫెదరర్-నాదల్ జంట.. జాక్ సాక్-ఫ్రాన్సెస్ తియఫో ద్వయం చేతిలో ఓడిపోయింది. మ్యాచ్ ముగిసిన వెంటనే ఫెదరర్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడిని చూసి నాదల్, ఇతరులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. చాలా సేపటి వరకూ ఈ ఇద్దరూ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయారు.
చాలా ఏళ్ల పాటు టెన్నిస్ కోర్టులో ప్రత్యర్థులు ఉన్న ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం కూడా ఉంది. అందుకే ఫెదరర్ ఆట నుంచి వైదొలుగుతుంటే నాదల్ గుండె కూడా బరువెక్కింది. ఈ ఇద్దరూ స్టేడియంలో బెంచ్ పై కూర్చొని ఏడుస్తున్న ఫొటోను భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆట గొప్పతనం ఇదేనని అభిప్రాయపడ్డాడు.
‘ఇద్దరు ప్రత్యర్థులు ఒకరి పట్ట మరొకరు ఇలా ఉంటారని ఎవరు అనుకుంటారు. ఇదే ఆట గొప్పతనం. ఇది నేను చూసిన అత్యంత అందమైన క్రీడా చిత్రం. మీ సహచరులు మీ కోసం కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు.. దేవుడు ఇచ్చిన ప్రతిభతో మీరు ఏం సాధించగలిగారో మీకు తెలుస్తుంది. ఈ ఇద్దరిని గౌరవించడం తప్ప మరేమీ చేయలేము’ అని కోహ్లీ పేర్కొన్నాడు.