JackFruit: పనసపొట్టుతో మధుమేహానికి చికిత్స.. శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య విజ్ఞాన సంస్థ అధ్యయనంలో గుర్తింపు
- రోజూ 30 గ్రాముల పచ్చి పనసపొట్టు తీసుకుంటే షుగర్ స్థాయులు అదుపులో ఉంటాయని గుర్తింపు
- పరిశోధన వివరాలను మీడియాకు వెల్లడించిన జాక్‌ఫ్రూట్ 365 సంస్థ
- పనసలోని అధిక ఫైబర్ వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుందని వివరణ
వానాకాలం వచ్చిందంటే పనస పండ్లు మార్కెట్లోకి వస్తాయి. ఇక పనస పొట్టుతో వండే కూర రుచే వేరు. దానికి తోడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉంటాయి. అంతేకాదు. అసలు పనసతో మరింత అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నట్టు శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య విజ్ఞాన సంస్థ తమ పరిశోధనలో గుర్తించింది. షుగర్ వ్యాధికి చికిత్సలో పచ్చి పనసపొట్టు పిండి అద్భుతంగా పనిచేస్తుందని తేల్చింది. ఇది మధుమేహ రోగుల రక్తంలో షుగర్ స్థాయులను బాగా నియంత్రిస్తున్నట్టు నిర్ధారించింది. ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలను ‘జాక్‌ఫ్రూట్ 365’ సంస్థ మీడియాకు వెల్లడించింది. నిత్యం తగిన మోతాదులో పచ్చి పనసపొట్టు పిండిని తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటోందని గుర్తించినట్టు తెలిపింది.
రెండు గ్రూపులుగా చేసి అధ్యయనం..
- 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉండి.. మధుమేహానికి మందులు వాడుతున్నవారిపై శ్రీకాకుళం వైద్య విజ్ఞాన సంస్థ వైద్యులు పరిశోధన చేశారు.
- మొత్తం 40 మందిని రెండు గ్రూపులుగా విభజించి.. ఒక గ్రూప్ లోని వారికి రోజూ 30 గ్రాముల పచ్చి పనసపొట్టు పిండిని 12 వారాలు అందించారు. మరో గ్రూప్ లోని వారికి ఇదే బరువున్న ఇతర పిండి తరహా పదార్థాన్ని అందించారు.
- ఈ 12 వారాల సమయంలో వారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయులు, పీపీజీ, కొవ్వుల స్థాయులు, బరువు పెరుగుతున్నారా, ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయా? వంటివి పరిశీలించారు. మొత్తంగా పనస పొట్టు పిండిని వాడినవారిలో మధుమేహం బాగా నియంత్రణలో ఉన్నట్టు గుర్తించారు.
- ప్రపంచవ్యాప్తంగా కూడా పనస ప్రయోజనాలపై పలు పరిశోధనలు ఉన్నాయి. అమెరికన్ పరిశోధకులు కూడా పనస మధుమేహాన్ని నియంత్రించేందుకు పనిచేస్తుందని ప్రతిపాదించాయి.
- ఎలాంటి రసాయనాలు, పురుగు మందులూ అవసరం లేకుండా ఇవి పండుతాయి. పైగా వీటిలో విటమిన్ ఏ, సి, బి6తోపాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు తోడ్పడుతాయి.
- ఇక పనస తొనలను తరచూ తీసుకోవడం వల్ల కంటిచూపు కూడా మెరుగ్గా ఉంటుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. పనసలోని పోషకాలు మన చర్మం, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తాయి.
- ఇక పనసలో అధికంగా ఉండే ఫైబర్ మన జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది. మలబద్ధకం, అల్సర్లు వంటి సమస్యలను తగ్గిస్తుంది.