Uttarakhand: ఉత్తరాఖండ్ రిసెప్షనిస్ట్ హత్యకేసు: బీజేపీ నేత కుమారుడి రిసార్టు కూల్చివేత
- యువతి హత్య కేసులో అరెస్ట్ అయిన బీజేపీ నేత కుమారుడు
- సీఎం ఆదేశాలతో అతడి రిసార్ట్ కూల్చివేత
- రాష్ట్రంలోని మిగతా రిసార్టులపైనా దర్యాప్తు చేయాలని ఆదేశాలు
- నిందితుడు ఎవరైనా కఠిన శిక్ష తప్పదని హెచ్చరిక
తన రిసార్టులో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న 19 ఏళ్ల యువతి హత్యకేసులో అరెస్ట్ అయిన బీజేపీ నేత కుమారుడు పుల్కిత్ ఆర్య రిసార్ట్‌ను అధికారులు కూల్చివేశారు. ఈ హత్యపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చెలరేగడంతో స్పందించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి.. నిందితుడి ‘వనతార’ రిసార్ట్‌ను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో బుల్డోజర్లతో అధికారులు దానిని కూల్చివేశారు.
ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రిన్సిపల్ సెక్రటరీ అభినవ్ కుమార్ తెలిపారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్య, రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అకింత్ గుప్తాలను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది.
పుల్కిత్ ఆర్య రిసార్ట్ కూల్చివేతకు ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి ధామి.. రాష్ట్రంలోని అన్ని రిసార్టులపైనా దర్యాప్తు జరపాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వాటిని అక్రమంగా కనుక నిర్వహిస్తుంటే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
కఠిన చర్యలు తప్పవు: సీఎం
19 ఏళ్ల రిసెప్షనిస్ట్ హత్య విషయం వెలుగులోకి వచ్చిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు విమర్శలకు పదునుపెట్టాయి. దీంతో స్పందించిన సీఎం నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగానే రిసార్ట్ కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై సీఎం ధామి మాట్లాడుతూ.. ఇలాంటి నేరాలకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని, పోలీసులు తమ పని తాము చేస్తున్నారని, నిందితులను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. నేరస్థుడు ఎలాంటి వాడైనా ఇలాంటి క్రూరమైన నేరాలకు కఠిన శిక్ష పడుతుందని అన్నారు.
యువతి హత్య అనంతరం యమకేశ్వర్‌లోని నిందితుడి రిసార్టును కూల్చివేసి, నేరగాళ్ల వెన్నులో వణుకు తెప్పించాలని కోరినట్టు యుమకేశ్వర్ ఎమ్మెల్యే రేణు బిష్త్ చెప్పారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి రిసార్ట్ కూల్చివేతకు ఆదేశాలిచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడైన పుల్కిత్ ఆర్య హరిద్వార్ బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు. వినోద్ గతంలో రాష్ట్రమంత్రిగా పనిచేశారు.