Shashi Tharoor: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంపై క్లారిటీ ఇచ్చిన దిగ్విజయ్ సింగ్
- అధ్యక్ష పదవికి పోటీ పడటం లేదన్న దిగ్విజయ్
- బరిలో నిలిచిన అశోక్ గెహ్లాట్, శశిథరూర్
- గెహ్లాట్ గెలుపుకే అధిక అవకాశాలు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి తాను కూడా పోటీ చేయబోతున్నట్టు జరుగుతున్న ప్రచారానికి దిగ్విజయ్ సింగ్ తెరదించారు. తాను పోటీ పడటం లేదని ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తాను పోటీ చేయబోనని... తనకు హైకమాండ్ ఇచ్చే సూచనలను పాటిస్తానని చెప్పారు.
ఇక దిగ్విజయ్ ప్రకటనతో కన్ఫ్యూజన్ మొత్తం తొలగిపోయింది. పార్టీ టాప్ పోస్ట్ కు కేవలం అశోక్ గెహ్లాట్, శశిథరూర్ మాత్రమే పోటీ చేస్తున్నారనే విషయం స్పష్టమయింది. అయితే గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన గెహ్లాట్ కే గెలిచే అవకాశాలు ఉన్నాయి. శశిథరూర్ కు మద్దతు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 24 నుంచి మొదలు కానున్న నామినేషన్ల స్వీకరణ ఈ నెల 30తో ముగియనుంది. అక్టోబర్ 1న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 8 వరకు గడువు ఉంది. ఆ తర్వాత బరిలో ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే... అక్టోబర్ 17న పోలింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ 19న ఫలితాలను వెల్లడిస్తారు.