Amit Shah: పీఎఫ్​ఐ వ్యవహారంపై అమిత్​ షా, అజిత్​ దోవల్​ కీలక భేటీ.. నిషేధం విధించే అవకాశం!

Amit shah holds meet to discuss on pfi terror suspects
  • దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఎన్ఐఏ దాడులు, అరెస్టులు
  • వ్యాయామ శిక్షణ, న్యాయ అవగాహన పేరిట ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయనే ఆరోపణలు
  • ఈ సమయంలో చర్చనీయాంశంగా మారిన అమిత్ షా భేటీ
పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యకలాపాలకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక భేటీ ఏర్పాటు చేశారు. యువతకు శిక్షణ, న్యాయ అంశాలపై అవగాహన పేరుతో పీఎఫ్ఐ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యాలయాలు, ఆ సంస్థ సభ్యులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాడులు, అరెస్టులు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

అత్యంత కీలక అధికారులతో..
అమిత్ షా నిర్వహించిన సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా, ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌ దినకర్‌ గుప్తాతోపాటు మరికొందరు కీలక అధికారులు పాల్గొన్నారు. పీఎఫ్‌ఐ కార్యకర్తలు, ఉగ్రవాద అనుమానితుల విషయంలో ఏం చేయాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చించారని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు.

నిషేధం విధించే యోచనతో..
పీఎఫ్ఐ సంస్థ యువతకు శిక్షణ, న్యాయ అంశాలపై అవగాహన పేరుతో చట్టవిరుద్ధ కార్యకలపాలు సాగిస్తోందనే ఆరోపణలతో ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు, తీవ్రవాద భావజాలం వ్యాప్తి వంటివి జరుగుతున్నట్టుగా గుర్తించినట్టు ఎన్ఐఏ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో పీఎఫ్‌ఐపై నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయని.. అందుకే అమిత్ షా అత్యవసర భేటీ నిర్వహించారని వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు, అరెస్టులు కొనసాగుతున్నాయి.
Amit Shah
PFI
NIA
National
India

More Telugu News