- నేపాల్ రాజధాని ఖాట్మండూలో మొహమ్మద్ ను కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు
- ఐఎస్ఐ ఏజెంట్ గా వ్యవహరిస్తున్న మొహమ్మద్
- ప్రాణాలు కాపాడుకునేందుకు కారు చుట్టూ పరుగెత్తిన వైనం
మన దేశంలోనే అతి పెద్ద నకిలీ కరెన్సీ సరఫరాదారుడైన లాల్ మొహమ్మద్ అలియాస్ మొహమ్మద్ దర్జీ (55)ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. నేపాల్ రాజధాని ఖాట్మండూలో తను ఉంటున్న రహస్య ప్రదేశంలోనే దారుణంగా హతమార్చారు. ఈ ఘటన ఈ నెల 19నే జరిగినప్పటికీ... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కి మొహమ్మద్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నాడు. భారత్ లో కార్యకలాపాలను కొనసాగిస్తూ... నేపాల్ లో రహస్యంగా ఉంటున్నాడు. ఈ విషయాన్ని జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే కాసేపటి క్రితం వెల్లడించింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ విషయాన్ని తెలిపినట్టు ఇండియా టుడే పేర్కొంది.
మొహమ్మద్ దర్జీని కాల్చి చంపుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను షూట్ చేస్తున్నట్టు ఫుటేజ్ లో ఉంది. మరోవైపు... ఫేక్ కరెన్సీని పాకిస్థాన్, బాంగ్లాదేశ్ ల నుంచి మొహమ్మద్ నేపాల్ కు తెప్పించుకుని... అక్కడి నుంచి భారత్ లోకి తరలిస్తుంటాడు. ఐఎస్ఐకి సంబంధించిన ఇతర వస్తువులను కూడా తరలిస్తుంటాడని, గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీంతో అతనికి సంబంధాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ అధికారులు చెపుతున్నారు. ఐఎస్ఐ ఏజెంట్లకు కూడా అతను షెల్టర్ ఇస్తుంటాడు.
సీసీటీవీ ఫుటేజ్ లో ఏముందంటే..
ఖాట్మండూలోని గోథాటర్ ప్రాతంలోని తన నివాసం వెలుపల తన లగ్జరీ కారు నుంచి మొహమ్మద్ కిందకు దిగాడు. క్షణాల వ్యవధిలోనే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. ప్రాణాలను కాపాడుకునే క్రమంలో ఆయన తన కారు చుట్టూ పరిగెత్తే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ దుండగులు ఆయన వెంటే పరుగెత్తుతూ కాల్పులు జరిపారు. ఇంకోవైపు, మొహమ్మద్ కుమార్తె తన తండ్రిని కాపాడుకోవడానికి బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకింది. అయితే ఈ లోగానే మొహమ్మద్ ప్రాణాలు కోల్పోయాడు. దుండగులు సేఫ్ గా అక్కడి నుంచి పరారయ్యారు.