ECIL: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్ షోరూంలో భారీ చోరీ.. రూ. 70 లక్షల విలువైన సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లిన దొంగ!
- ఈసీఐఎల్ చౌరస్తాలో ఘటన
- వెంటిలేటర్ ఇనుప చువ్వలు తొలగించి లోపలికి దూకిన దొంగ
- సెల్‌ఫోన్లు తప్ప మిగతా వస్తువుల జోలికి వెళ్లని వైనం
- తెలిసిన వారి పనే అయి ఉంటుందని అనుమానం
హైదరాబాద్‌లోని ఓ ఎలక్ట్రానిక్ షోరూంకి కన్నమేసిన దొంగ ఏకంగా రూ. 70 లక్షలకు పైగా విలువైన మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లాడు. ఈసీఐఎల్ చౌరస్తాలో ఉన్న ఈ షోరూంలో బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ దొంగతనం జరిగింది. షోరూం మూలన ఉన్న వెంటిలేటర్ ఇనుప చువ్వలు, ఫాల్స్ సీలింగ్ తొలగించి దొంగ లోపలికి చొరబడ్డాడు. లోపలికి దిగిన తర్వాత సీసీ కెమెరాలు పనిచేయకుండా వాటి వైర్లను కట్ చేశాడు. అనంతరం 200కుపైగా ఐఫోన్, వివో, ఒప్పో, వన్‌ప్లస్ ఫోన్లను తీసుకుని పరారయ్యాడు. అయితే, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల జోలికి మాత్రం వెళ్లకపోవడం గమనార్హం.
నిన్న ఉదయం షోరూం తెరిచిన సిబ్బంది చోరీ విషయాన్ని గుర్తించారు. సంస్థ జనరల్ మేనేజర్ మహ్మద్ హబీబ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు షోరూంకు చేరుకుని ఆధారాలు సేకరించాయి. ఓ సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలను బట్టి చోరీకి పాల్పడింది ఒక్కడేనని పోలీసులు నిర్ధారించారు. అతడికి ఇంకెవరైనా సహకరించి ఉంటారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ఇది తెలిసినవారి పనేనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నేరుగా సెల్‌ఫోన్లు ఉండే చోటు వద్దకు వెళ్లడం ఇందుకు ఊతమిస్తోంది. సెల్‌ఫోన్లు కొనేందుకు వచ్చి రెక్కీ నిర్వహించి పథకం ప్రకారమే చోరీ చేసినట్టు అనుమానిస్తున్నారు.