england: ‘అల్లాహు అక్బర్' నినాదాలతో ఇంగ్లండ్ లోని హిందూ దేవాలయం ముందు ముస్లింల నిరసన
- స్మెత్‌విక్ పట్టణంలోని హిందూ దేవాలయం ముందు
గుమిగూడిన 200 మంది ముస్లిం యువకులు - అడ్డుకొని చెదరగొట్టిన స్థానిక పోలీసులు
- ఆసియా కప్ లో భారత్ - పాక్ మ్యాచ్ తర్వాత ఇరు వర్గాల మధ్య మొదలైన ఘర్షణ
గత నెల చివర్లో దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత లండన్ సమీపంలో లీసెస్టర్ లో హిందూ-ముస్లింల మధ్య మొదలైన ఘర్షణ ఇంకా చల్లారడం లేదు. తాజాగా ముస్లిం కమ్యూనిటీకి చెందిన 200 మంది వ్యక్తులు వెస్ట్ మిడ్‌లాండ్స్‌లోని స్మెత్‌విక్ పట్టణంలోని హిందూ దేవాలయం వెలుపల నిరసనను నిర్వహించడానికి గుమిగూడారు.
సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోల ప్రకారం స్పాన్ లేన్‌లోని దుర్గా భవన్ హిందూ సెంటర్ వైపు పెద్ద సంఖ్యలో దూసుకొచ్చారు. చాలా మంది 'అల్లాహు అక్బర్' అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. కొంతమంది నిరసనకారులు గోడలు ఎక్కడం కనిపించింది. ‘అప్నా ముస్లిం’ అనే సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ వర్గం మంగళవారం దుర్గా భవన్ ఆలయం వెలుపల ఈ నిరసనకు పిలుపునిచ్చింది. భారత్- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ తర్వాత తూర్పు ఇంగ్లండ్‌లోని లీసెస్టర్‌లో చెలరేగిన హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నగరంలోని ఒక హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారని, దాని వెలుపల ఉన్న కాషాయ జెండాను గుర్తుతెలియని వ్యక్తులు లాగారని కూడా వార్తలు వచ్చాయి. భారత్- పాక్ ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో హిందూ, ముస్లిం గ్రూపులు ఘర్షణ పడిన తర్వాత పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఈ ఘటన తర్వాత లండన్‌లోని భారత హైకమిషన్ భారతీయ సమాజంపై హింసను ఖండించింది. దీనిపై తీవ్ర పదజాలంతో స్పందిస్తూ.. బాధితులకు రక్షణ కల్పించాలని స్థానిక అధికారులను కోరింది. లీసెస్టర్ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 47 మందిని అరెస్టు చేశారు. మరోవైపు హిందూ, ముస్లిం సంఘాల నాయకులు మంగళవారం ఉదయం లీసెస్టర్‌లోని మసీదు మెట్లపై సమావేశమై శాంతి, సామరస్యాన్ని కోరుతూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రెచ్చగొట్టడాన్ని, హింసను తక్షణమే నిలిపివేయాలని కూడా పిలుపునిచ్చారు.