Rohit Sharma: ఆస్ట్రేలియాతో తొలి టీ20లో టీమిండియా ఓటమికి కారణాలివే!
- భారీ స్కోరు సాధించినా ఫలితం శూన్యం
- భారత్‌ను దెబ్బతీసిన చెత్త ఫీల్డింగ్
- డెత్ ఓవర్లలో పరుగులు సమర్పించేసుకున్న బౌలర్లు
- స్పష్టంగా కనిపించిన కెప్టెన్సీ తప్పిదాలు
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గత రాత్రి మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరు సాధించినా ఓటమి పాలైంది. భారత్ నిర్దేశించిన 209 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కేఎల్ రాహుల్ (55) అర్ధ సెంచరీకి తోడు హార్దిక్ పాండ్యా (71 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (46) మెరుపులతో భారత్ భారీ స్కోరు సాధించినా దానిని కాపాడుకోవడంలో విఫలమైన భారత జట్టు ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన ఓటమికి చాలా కారణాలే ఉన్నాయి. అవేంటో చూద్దాం.
దెబ్బతీసిన బౌలింగ్
డెత్ ఓవర్లలో బౌలింగ్ భారత్‌కు ప్రధాన సమస్యగా మారింది. ఆసియా కప్‌లోనూ భారత్‌ను ఇదే దెబ్బతీసింది. 209 పరుగుల విజయ లక్ష్యం చాలా పెద్దది. భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా దూకుడుగానే బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే, 123 పరుగుల వద్ద మ్యాక్స్‌వెల్ రూపంలో నాలుగో వికెట్ కోల్పోవడంతో కష్టాల్లో పడింది.
ఇక, చివరి నాలుగు ఓవర్లలో ఆసీస్ విజయానికి 55 పరుగులు కావాలి. క్రీజులో మ్యాథ్యూవేడ్, కొత్త కుర్రాడు టిమ్ డేవిడ్ ఉన్నారు. హిట్టర్లు అయిన వీరిద్దరిలో ఏ ఒక్కరిని అవుట్ చేసినా భారత్ విజయం ఖాయమని అభిమానులు సంబరపడ్డారు. అయితే, పొదుపుగా బౌలింగ్ చేసి ఒత్తిడి పెంచాల్సిన సమయంలో బౌలర్లు కట్టుతప్పారు. 17వ ఓవర్ వేసిన భువనేశ్వర్ ఏకంగా 15 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్ వేసిన హర్షల్ పటేల్ మూడు సిక్సర్లతో ఏకంగా 22 పరుగులు ఇచ్చుకోవడంతో మ్యాచ్ ఆస్ట్రేలియా వైపు మొగ్గింది. 19వ ఓవర్ వేసిన భువీ ఈసారి 6 పరుగులు సమర్పించుకున్నారు. 20 బంతుల్లోనే 57 పరుగులు ఇచ్చుకోవడంతో భారత్ పరాజయం పాలైంది.
క్యాచెస్ విన్ మ్యాచెస్
‘క్యాచెస్ విన్ మ్యాచెస్’ అని చెబుతుంటారు. భారత జట్టు ఓటమిలో ఇది మరోమారు నిరూపితమైంది. చెత్తఫీల్డింగ్ విజయావకాశాలను దెబ్బతీసింది. ఏకంగా మూడు క్యాచ్‌లు జారవిడవడం టీమిండియా కొంప ముంచింది. హార్దిక్ పాండ్యా బౌలింగులో గ్రీన్ ఇచ్చిన క్యాచ్‌ను అక్షర్ పటేల్ విడిచిపెట్టాడు. అప్పటికి గ్రీన్ 42 పరుగులతో ఉన్నాడు. లైఫ్ దొరకడంతో ఆ తర్వాత రెచ్చిపోయి 61 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్మిత్ క్యాచ్‌ను కేఎల్ రాహుల్ నేలపాలు చేస్తే, 18 ఓవర్ రెండో బంతికి దూకుడుమీదున్న వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను హర్షల్ పటేల్ విడిచిపెట్టేశాడు. ఈ తప్పిదాలు భారత్ కొంపముంచాయి.
కెప్టెన్సీ తప్పిదాలు
ఈ మ్యాచ్‌లో కెప్టెన్సీ తప్పిదాలు కూడా భారత జట్టు ఓటమికి కారణమయ్యాయి. ఉమేశ్ యాదవ్ తన తొలి ఓవర్‌లోనే వరుసగా నాలుగు ఫోర్లతో 16 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఆ తర్వాతి ఓవర్‌లో అతడిని పక్కనపెట్టిన రోహిత్ 12వ ఓవర్‌లో తిరిగి బౌలింగ్‌కు దింపాడు. ఆ ఓవర్‌లో తొలి రెండు బంతులకు 6,4 సమర్పించుకున్నా ఆ తర్వాత స్మిత్, మ్యాక్స్‌వెల్‌ను అవుట్ చేయడంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది.
అయితే, ఇక్కడ మరోమారు కెప్టెన్సీ తప్పిదం కనిపించింది. వికెట్లు తీసి ఊపుమీదున్న ఉమేశ్‌కు చివరి ఓవర్లలో బౌలింగ్ ఇవ్వకుండా పక్కనపెట్టి తప్పుచేశాడు. చివరి ఓవర్లలో ఉమేశ్ చేతికి బంతి ఇచ్చి ఉంటే వికెట్లు తీసి ఉండేవాడు. ఈ అవకాశాన్ని రోహిత్ జారవిడుచుకున్నాడు. భారత ఆటగాళ్ల తప్పిదానికి తోడు కేమరూన్ గ్రీన్, మ్యాథ్యూవేడ్‌లు చెలరేగిపోవడంతో భారత్ ఓటమి పాలు కాక తప్పలేదు.