Renuka Chowdary: గుడివాడ నుంచి పోటీ చేస్తా.. కొడాలి నానిని మళ్లీ ఎవరూ ఎన్నుకోరు: రేణుకా చౌదరి
ఖమ్మంలో కార్పొరేటర్ గా కూడా రేణుకా చౌదరి గెలవలేరన్న కొడాలి నాని
కొడాలి నాని లారీలు కడుక్కునే సమయంలోనే తాను కార్పొరేటర్ ని అన్న రేణుక
ఏపీ అసెంబ్లీలో తన పేరు తీసుకొచ్చి చాలా పబ్లిసిటీ తీసుకొచ్చాడని వ్యాఖ్య
అమరావతే ఏపీ రాజధానిగా ఉండాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమానికి, పాదయాత్రకు మాజీ ఎంపీ రేణుకా చౌదరి మద్దతు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రలో కూడా ఆమె పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శలు గుప్పించారు. ఖమ్మంలో కార్పొరేటర్ గా కూడా గెలవలేని రేణుకా చౌదరికి అమరావతిలో ఏం పని? అని ఆయన ప్రశ్నించారు. కొడాలి కామెంట్ పై రేణుక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఘాటుగా స్పందించారు.
కొడాలి నాని లారీలు కడుక్కునే సమయంలోనే తాను కార్పొరేటర్ ని అని రేణుకా చౌదరి అన్నారు. "బుజ్జీ నీకు చరిత్ర తెలియదు... రాజీవ్ గాంధీ ఇచ్చిన సెల్ ఫోన్ లో గూగుల్ కొట్టు. రేణుకా చౌదరి అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. నువ్వు మాజీ మినిస్టర్ కదా. నువ్వు ఏదో పదవి కోసం అసెంబ్లీలో నా పేరు తీసుకొచ్చావ్. చాలా థ్యాంక్స్. కొడాలి నాని ఎంత అమాయకుడు కాకపోతే... ఏపీ అసెంబ్లీలో నా పేరు తీసుకొచ్చి... నాకు బొచ్చెడు పబ్లిసిటీ తీసుకొచ్చాడు. ఇంత పబ్లిసిటీ తెచ్చుకోవాలంటే చాలా ఖర్చు పెట్టాలి. నాని వల్ల నాకు పబ్లిసిటీ ఫ్రీగా వచ్చింది.
నేను టీడీపీకి మద్దతుగా లేను. ఖమ్మంలోనే గెలవలేనని కొడాలి నాని మాట్లాడుతూ నాకు మంచి ఐడియా ఇచ్చాడు. నేను వచ్చే ఎన్నికల్లో ఆయన నియోజకవర్గం గుడివాడ నుంచే పోటీ చేస్తా. నేను మున్సిపల్ కార్పొరేటర్ గా చేశా. ఎంపీగా, కేంద్ర మంత్రిగా చేశా. ఎమ్మెల్యేగా ఎప్పుడూ చేయలేదు. గుడివాడలో పోటీ చేస్తే.. నేనే గెలుస్తా. కొడాలి నానిని ఎవరూ మళ్లీ ఎన్నుకోరు. ఎక్కడ నుంచి పోటీ చేసినా కాంగ్రెస్ తరపునే పోటీ చేస్తా.
ఏదైనా జరిగే అవకాశం ఉంది. నేను గెలవచ్చు. నా గత చరిత్రే నన్ను గెలిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో ఆరు మంది కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. ఖమ్మం జిల్లాలో ఎంపీగా నేను చేసినంత ఎవరూ చేయలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ బంజారా భవన్ ఇచ్చింది... మేము ఎప్పుడో ఇచ్చాం. కొడాలి నాని వచ్చి ఇక్కడ గల్లీల్లో తిరిగి చూస్తే నేనేంటో తెలుస్తుంది" అని ఆమె వ్యాఖ్యానించారు.