Somireddy Chandra Mohan Reddy: మీడియా సంస్థలు, వాటి అధిపతులపై అసెంబ్లీలో సీఎం జగన్ వ్యాఖ్యలు దారుణం: సోమిరెడ్డి
- ఎల్లో మీడియా అంటూ సీఎం జగన్ విమర్శలు
- ఓ కులాన్ని టార్గెట్ చేశారన్న సోమిరెడ్డి
- జగన్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం
నిండు సభ సాక్షిగా ఓ కులాన్ని, మీడియా సంస్థలను, వాటి అధినేతలను టార్గెట్ చేస్తూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు దారుణమని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశామని, కానీ ఓ ముఖ్యమంత్రి ఇంత దుర్మార్గంగా మాట్లాడడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. జగన్ సీఎం అయ్యాక ఆయన సొంత కులం సహా ఏ వర్గానికి మేలు జరగలేదని అన్నారు.
ఈనాడు, ఈటీవీ మీడియా ఇవాళ ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించిందని, వాటిపై మీకు ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలను ఈటీవీ ప్రసారం చేయడాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు.
"వారు పెరుగు, పచ్చళ్లు చేస్తున్నారట... మరి తమరు ఇసుక, సిలికా, గనులు, మద్యం, సరస్వతి సిమెంట్, భారతి సిమెంట్, సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్ కర్ణాటక, మంత్రి డెవలపర్స్ బెంగళూరు, బెంగళూరులో అతి పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ వ్యాపారాలు చేయడం లేదా? మీరు చేయనిది ఏంటి? జగన్ రెడ్డి దోపిడీ సొమ్ముతో సాక్షి పత్రిక, టీవీ చానళ్లు ఏర్పాటయ్యాయి. కష్టార్జితంతో పైకొచ్చిన ఈనాడు గ్రూప్, ఇతర సంస్థలపై జగన్ మాట్లాడడం ఏంటి? ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకుని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు" అంటూ సోమిరెడ్డి ధ్వజమెత్తారు.
చంద్రబాబుకు మద్దతుగా ఎల్లో మీడియా తమ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తోందని సీఎం జగన్ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5ల పేర్లను ప్రస్తావించి విమర్శలు గుప్పించారు.