Heavy Rains: నేడు ఒడిశాలో భారీ వర్షాలు.. మహారాష్ట్రలో మునిగిన రైల్వే ట్రాక్‌లు

Odisha braces for heavy rainfall today Warns IMD

  • దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు
  • తూర్పు-మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం
  • నేడు అల్పపీడనంగా మారే అవకాశం
  • చేపల వేటకు వెళ్లొద్దని జాలర్లకు హెచ్చరికలు
  • యూపీ, బీహార్‌లో తగ్గుముఖం పట్టనున్న వర్షాలు

భారీ వర్షాలతో దేశంలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతుండగా నేడు ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వచ్చే కొన్ని రోజులపాటు ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయుగుండం నేడు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. 

మరోవైపు, ఉత్తరప్రదేశ్‌లో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు డియోరీ జిల్లాలో ఓ ఇంటి గోడ కూలి మూడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గత కొన్ని రోజులుగా డియోరీ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు, రహదారులు మునిగిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఇళ్లు నీటమునిగాయి. 

మరోవైపు, ఒడిశాలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కటక్, ఖుర్దా, పూరి, జగత్‌సింగ్‌పూర్, గంజాం, గజపతి, కలహండి, కేంద్రపర, కంధమాల్ జిల్లాలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని కోస్తా, దక్షిణ ప్రాంతాల్లో రేపు (సోమవారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అలాగే, మంగళవారం పలు జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తాయని పేర్కొంది. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. 

మహారాష్ట్రలో మునిగిన రైల్వే ట్రాకులు 
మహారాష్ట్రను కూడా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. థానేలో కుండపోతగా కురుస్తున్న వానలకు రైల్వే ట్రాకులు మునిగిపోయాయి. పూణెలోని మూల ముత్త నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఖండక్‌వాస్లా డ్యామ్ పరీవాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో డ్యామ్ పూర్తిగా నిండిపోయింది. దీంతో నీటిని విడుదల చేయడంతో ఖండక్‌వాస్లా బ్రిడ్జి మునిగిపోయింది. 

ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లో తగ్గుముఖం పట్టనున్న వర్షాలు
ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లో కురుస్తున్న భారీ వర్షాలు వచ్చే కొన్ని రోజుల్లో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. యూపీలో వర్షాల కారణంగా యూపీలోని వివిధ ప్రాంతాల్లో ఒకే రోజు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. గతకొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పడుతుండడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.

Heavy Rains
Odisha
Uttar Pradesh
Maharashtra

More Telugu News