Andhra Pradesh: శాసన మండలి చైర్మన్ కుర్చీలో వైసీపీ నేత 'కుప్పం' భరత్... ఫొటో ఇదిగో
![ysrcp mla krj bharath chairs ap lagislative concil for a while on fri day](https://imgd.ap7am.com/thumbnail/cr-20220917tn6325c7f69fd9e.jpg)
- కుప్పం వైసీపీ ఇంచార్జీగా ఉన్న భరత్
- శుక్రవారం కాసేపు మండలి చైర్మన్‌గా వ్యవహరించిన వైనం
- మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో దక్కిన అవకాశం
చట్ట సభల్లో ఇప్పుడు కొత్త తరం సత్తా చాటుతోంది. మొన్నటికి మొన్న మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ ఎన్నికైన సంగతి తెలిసిందే. దేశంలోనే అతి చిన్న వయసులో స్పీకర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన నేతగా నర్వేకర్ గుర్తింపు సాధించారు. తాజాగా ఏపీ శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్న వైసీపీ యువ నేత కేఆర్‌జే భరత్... శాసన మండలి చైర్మన్ కుర్చీలో కూర్చుని కనిపించారు.
ప్రస్తుతం 33 ఏళ్ల వయసున్న భరత్... టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో కుప్పం వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఎన్నికల ఫలితాలు విడుదల కాకముందే మృతి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి కుమారుడే భరత్. తండ్రి మృతితో కుప్పం వైసీపీ ఇంచార్జీగా భరత్ ఎంపికయ్యారు. ఈ క్రమంలో వైసీపీ అధిష్ఠానం ఆయనకు శాసన మండలి సభ్యత్వం ఇచ్చింది.
శుక్రవారం నాటి సమావేశాల్లో భాగంగా శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు కాసేపు విశ్రాంతి తీసుకోగా... ఆయన స్థానంలో భరత్ మండలి చైర్మన్‌గా వ్యవహరించారు. మోషేన్ రాజు గైర్హాజరీలో డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న జకియా ఖానామ్ కూడా అందుబాటులో లేకపోవడంతో ప్యానెల్ చైర్మన్‌గా ఉన్న భరత్.. కాసేపు మండలి చైర్మన్‌గా వ్యవహరించారు.