Nirmala Sitharaman: బ్యాంకులు స్థానిక భాష మాట్లాడేవారినే తమ సిబ్బందిగా నియమించుకోవాలి: నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman attends national banks association meeting

  • ముంబయిలో జాతీయ బ్యాంకుల అసోసియేషన్ సమావేశం
  • హాజరైన నిర్మలా సీతారామన్
  • బ్రాంచిల్లో నియమించే ఉద్యోగుల అంశంలో కీలక సూచనలు

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబయిలో జరిగిన భారత బ్యాంకుల అసోసియేషన్ 75వ వార్షిక సర్వసభ్య సమావేశంలో నిర్మల మాట్లాడుతూ, బ్యాంకులు స్థానిక భాషను మాట్లాడేవారినే సిబ్బందిగా నియమించుకోవాలని తెలిపారు.

బ్రాంచి స్థాయిలో ప్రాంతీయ భాషలు మాట్లాడే సిబ్బంది లేకపోతే సమస్యలు వస్తాయని అన్నారు. స్థానిక భాష మాట్లాడలేని సిబ్బంది "మీరు హిందీ మాట్లాడరు కదా, అయితే మీరు భారతీయులు కారు" అంటూ తమ దేశభక్తిని కస్టమర్ల ముందు ప్రదర్శించే అవకాశం ఉందని అన్నారు. ఇలాంటి ధోరణులు బ్యాంకుల వ్యాపారానికి ఏమంత మంచిది కాదని హితవు పలికారు. 

బ్రాంచిల్లో నియమితులయ్యే ఉద్యోగులను బ్యాంకులు సమీక్షిస్తుండాలని కోరారు. స్థానిక భాష మాట్లాడలేని ఉద్యోగులను కస్టమర్లతో లావాదేవీలు జరిపే పోస్టుల్లో నియమించరాదని స్పష్టం చేశారు. ఉద్యోగ నియామకాల విషయంలో బ్యాంకులు ఇలాంటి అనేకరకాల సున్నితమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. 

ఉద్యోగాల భర్తీలో అన్నివర్గాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. "మీరున్నది వ్యాపారం కోసమే. అంతేతప్ప, ప్రజల్లో ఫలానా విలువలే ఉండాలనే వ్యవస్థను పెంపొందించడం మీ విధి కాదు" అని స్పష్టం చేశారు.

More Telugu News