Sudheer Babu: మూవీ రివ్యూ: 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'

Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review

  • ఈ  శుక్రవారమే విడుదలైన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' 
  • ఇంద్రగంటితో సుధీర్ బాబుకి ఇది మూడో సినిమా
  • ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే ఎమోషన్ కే ప్రాధాన్యం 
  • అదనపు బలంగా నిలిచిన ఫొటోగ్రఫీ -  సంగీతం
  • బలమైన కథ .. ఆసక్తికరమైన కథనం లేకపోవడమే లోపం

సుధీర్ బాబు - కృతి శెట్టి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా రూపొందింది. బెంచ్ మార్క్ - మైత్రీవారు కలిసి ఈ సినిమాను నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా ఈ శుక్రవారమే థియేటర్లకు వచ్చింది. ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు చేసిన 'సమ్మోహనం' సక్సెస్ కాగా, ఆ తరువాత వచ్చిన 'వి' ఆకట్టుకోలేకపోయింది. ఈ ఇద్దరూ కలిసి మూడో ప్రాజెక్టుగా చేసిన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందన్నది చూద్దాం. 

దర్శకుడు నవీన్ (సుధీర్ బాబు) వరుస హిట్లతో డబుల్ హ్యాట్రిక్ ను తన ఖాతాలో వేసుకుంటాడు. యూత్ అంతా కూడా ఆయన సినిమాలను ఎక్కువగా లైక్ చేస్తుంటారు. ఆ తరువాత సినిమాను కొత్త కథతో .. కొత్త హీరోయిన్ తో చేయాలని చెప్పేసి, అందుకు సంబంధించిన ప్రయత్నాలు గట్టిగానే చేస్తుంటాడు. అదే సమయంలో 'అలేఖ్య' (కృతి శెట్టి) వీడియో ఒకటి ఆయన కంటపడుతుంది. ఆమె 'కంటి డాక్టర్' అని తెలుసుకుని వెంటనే కలుసుకుంటాడు. అతను టాప్ డైరెక్టర్ అయినా అలేఖ్య పెద్దగా పట్టించుకోదు. పైగా సినిమాల్లో చేసే ఆలోచనే తనకి లేదని తేల్చిచెబుతుంది. 

తన దగ్గర కో డైరెక్టర్ గా పనిచేస్తున్న బోసు (వెన్నెల కిశోర్) ద్వారా అలేఖ్య తల్లిదండ్రులను కదిలించే ప్రయత్నం చేస్తాడు నవీన్. ఆ ఇద్దరూ కూడా సినిమా అనే మాట వినపడగానే మండిపడతారు. సినిమావాళ్లను దగ్గరికి కూడా రానీయరు. అందుకు కారణం ఏమిటో ఎలాగైనా తెలుసుకోవాలని, అలేఖ్యను తన సినిమా కోసం ఒప్పించాలని నవీన్ నిర్ణయించుకుంటాడు. ఆ ప్రయత్నంలో నవీన్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అలేఖ్యతో అతను సినిమా చేయగలుగుతాడా? లేదా? అనేదే కథ.
 
ఇంద్రగంటి సినిమాల ప్రధానమైన లక్షణం .. కథ నిదానంగా నడవడం. ఎలాంటి హడావిడి లేకుండా అనుకున్న గమ్యానికి చేరుకోవడం. కాకపోతే ఈ సినిమా ఇంకా కాస్త నిదానంగా నడుస్తుంది. ఫస్టాఫ్ అంతా కూడా హీరోయిన్ అనుగ్రహం కోసం ఆమె చుట్టూ హీరో తిరగడానికే ఖర్చయిపోయింది. ఇంటర్వెల్ వరకూ కూడా హీరోయిన్ హీరో ప్రేమలో పడదు గనుక, వాళ్లిద్దరి మధ్య ఎలాంటి రొమాంటిక్ సీన్స్ ఉండవు. వెన్నెల కిశోర్ ఉన్నాడుగానీ .. ఆయన భుజాలపై నవ్వుల భారం ఎక్కువగా పెట్టలేదు. ఇక రాహుల్ రామకృష్ణను ఎందుకు పెట్టారనేది తెలియదు.

ఫస్టాఫ్ లో నిదానంగా .. నీరసంగా నడిచిన కథ, ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఆడియన్స్ కి కొత్త ఉత్సాహాన్ని .. కొంతవరకూ ఆసక్తిని కలిగిస్తుంది. దాంతో సెకండాఫ్ ఏదో బాగానే ఉండొచ్చులే .. త్వరగా పాప్ కార్న్ తెచ్చుకుని కూర్చోవాలి అనుకుంటారు. కానీ ఆ తరువాత చూస్తే, అప్పటివరకూ అలేఖ్య హాస్పిటల్ చుట్టూ తిరిగిన కథ .. ఆ తరువాత ఆమె ఇంటి చుట్టూ .. ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరగడం మొదలవుతుంది. మధ్యలో అవసరాల పాత్రతో మరో ట్విస్ట్ పడుతుందిగానీ, కథలో మాత్రం పరుగు కనిపించదు. అది ఇంద్రగంటి మార్క్ .. ఫీల్ కోసం ఆయన తీసుకునే టైమ్ అనుకోవాలంతే.  

ఇంద్రగంటి తాను అనుకున్న కథలను తెరపై చాలా సహజంగా చెబుతాడనే పేరుంది. ఈ కథను కూడా ఆయన సహజంగానే ఆవిష్కరించారు. కానీ కథలో కొత్తదనం లేదు .. అనూహ్యమైన మలుపులు లేవు .. ఎక్కడా కూడా ప్రేక్షకుల హావభావాల్లో మార్పులు రావు ..  తెరపై అలాంటి సన్నివేశాలు లేవు. క్లైమాక్స్ లో మాత్రం అలేఖ్య తండ్రిగా శ్రీకాంత్ అయ్యంగార్ సీన్ కాస్త ఉద్వేగానికి గురిచేస్తుందంతే. సుధీర్ బాబు .. కృతి శెట్టి ఇద్దరూ కూడా ఎవరి పాత్రకి వారు న్యాయం చేశారు. నటన పరంగా కృతి శెట్టి ఈ సినిమాతో మరింత పరిపక్వతని ప్రదర్శించిందనే చెప్పాలి. మిగతా వాళ్లంతా పాత్రలకి తగిన నటనను కనబరిచారు. 

వివేక్ సాగర్ స్వరపరిచిన పాటల్లో 'కొత్త కొత్తగా' హైలైట్. విడుదలకి ముందే ఈ పాట పాప్యులర్ అయింది. ఇక మాస్ బీట్ గా వచ్చిన 'ఆటోమేటిక్ దర్వాజా' కూడా మంచి ఊపుతోనే సందడి చేసింది. పీజీ విందా కెమెరా పనితనం .. ఎడిటింగ్  ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచాయనే చెప్పాలి. ఈ కథ .. కథగా చదువుకోవడానికి బాగుంటుంది. కానీ సినిమా రూపంలోకి వచ్చేసరికి, హీరో .. హీరోయిన్స్ మధ్య లవ్ .. రొమాన్స్ లేకుండానే ఇంటర్వెల్ వరకూ సాగిపోవడమే ఆడియన్స్ కి అసంతృప్తిగా అనిపిస్తుంది. ఆ తరువాత కథ కూడా చాలా వరకూ అదే మార్గంలో వెళ్లడం వలన నిరాశను కలిగిస్తుంది. 

ఇంత స్లోగా సాగే కథ యూత్ కి ఎక్కుతుందా? అనేది సందేహమే. ఐటమ్ సాంగ్ తప్పించి ఈ కథలో మాస్ ఆడియన్స్ వాటా మచ్చుకైనా కనిపించదు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఎంతవరకూ తీసుకుని వెళతారనేది చూడాలి.

--- పెద్దింటి గోపీకృష్ణ

More Telugu News