Telangana: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాలి: శంకర్ సింగ్ వాఘేలా
- హైదరాబాద్ వచ్చిన గుజరాత్ మాజీ సీఎం వాఘేలా
- ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో 5 గంటల పాటు భేటీ
- బీజేపీ దుర్మార్గ రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపు
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయవేత్త శంకర్ సింగ్ వాఘేలా శుక్రవారం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌కు వెళ్లిన వాఘేలా ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. దాదాపుగా 5 గంటలకు పైగా వాఘేలా, కేసీఆర్‌ల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. కేసీఆర్‌తో చర్చలు ముగించి బయటకు వచ్చిన వాఘేలా అక్కడే మీడియాతో మాట్లాడారు.
జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాలని వాఘేలా అభిలషించారు. బీజేపీ దుర్మార్గ రాజకీయాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీపై యుద్ధం చేస్తున్న కేసీఆర్‌కు తనలాంటి నేతల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు. గతంలో బీజేపీ అధిష్ఠానాన్ని వ్యతిరేకించి వేరు కుంపటి పెట్టుకుని మరీ గుజరాత్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వాఘేలా... ప్రస్తుతం ఎన్సీపీతో కలిసి సాగుతున్నారు.