Perseverance: మార్స్​ పై జీవం గుట్టు.. కీలక ఆనవాళ్లను గుర్తించిన పర్సవరెన్స్​ రోవర్​

Perseverance rover find organic matters on mars

  • మార్స్ పై జెజెరో క్రేటర్ వద్ద నమూనాలను సేకరించి పరిశీలించిన రోవర్
  • అందులో సేంద్రియ పదార్థాలను గుర్తించిన నాసా శాస్త్రవేత్తలు
  • జీవం ఉండే అవకాశానికి ఇవి ఆనవాళ్లు అని వెల్లడి

భూమి అవతల మరెక్కడైనా, మరే గ్రహంపైన అయినా జీవం ఉందా? అన్నది చాన్నాళ్లుగా మనుషుల మెదడును తొలిచేస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం కోసమే సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో మార్స్ పై తిరుగాడుతున్న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) కు చెందిన పర్సవరెన్స్‌ రోవర్‌ .. అక్కడి జెజెరో క్రేటర్ ప్రాంతంలో సేంద్రియ రసాయనాలను గుర్తించింది. సాధారణంగా జీవం ఉండేందుకు ఆస్కారం ఉన్న చోట మాత్రమే సేంద్రియ రసాయనాలు ఉంటాయన్నది శాస్త్రవేత్తల అంచనా. ఈ క్రమంలో అంగారకుడిపై జీవం ఆనవాళ్లకు సంబంధించి కీలక ముందడుగు పడిందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రాళ్లపై పరిశోధనలతో..
మార్స్ పై ఉన్న జెజెరో బిలంలో ఇసుకరాయి, రాతి శిలలు, బురద రాయిపై పరిశోధనలు చేసిన పర్సవరెన్స్ రోవర్... అందులో సేంద్రియ (ఆర్గానిక్‌) పరమాణువులు ఉన్నట్టు గుర్తించిందని నాసా శాస్త్రవేత్త కెన్‌ ఫార్లే వెల్లడించారు. ఆ సేంద్రియ పదార్థాల్లో కార్బన్‌, హైడ్రోజన్‌, ఆక్సిజన్‌, నైట్రోజన్‌, పాస్ఫరస్‌, సల్ఫర్‌ వంటి మూలకాలు కూడా ఉన్నట్టు తెలిపారు. ఇవన్నీ జీవానికి మూలమే అయినా.. మార్స్ పై గతంలో జీవం ఉందని ఇప్పటికిప్పుడు కచ్చితంగా చెప్పలేమన్నారు. అయితే ఆ నమూనాలను భూమిపైకి తీసుకొచ్చిన తర్వాత లోతైన అధ్యయనం చేయాల్సి ఉందని, అప్పుడే జీవం విషయంలో ఓ స్పష్టతకు రాగలమని పేర్కొన్నారు.

దాదాపు ఏడాదిన్నరగా పరిశీలన
నాసా గత ఏడాది ఫిబ్రవరిలో అంగారకుడిపైకి పర్సవరెన్స్ రోవర్ ను పంపింది. కోట్ల ఏళ్ల కిందట నీళ్లు ప్రవహించినట్టుగా ఆధారాలు ఉన్న జెజెరో క్రేటర్ వద్ద ఈ రోవర్ ను ల్యాండ్ చేయగా.. అప్పటి నుంచీ పరిశోధన చేస్తోంది. అక్కడి రాళ్లకు రంధ్రాలు చేసి నమూనాలను సేకరిస్తోంది. ఆ నమూనాలను త్వరలో మరో ప్రయోగం ద్వారా భూమికి తీసుకురానున్నారు.

  • Loading...

More Telugu News