Hair: జుట్టు రాలిపోవడాన్ని ఆపి.. బాగా పెరిగేలా చేసే ఐదు ఆహార పదార్థాలు ఇవిగో
- విటమిన్ సి, ఏ, కెరాటిన్ వంటి పోషకాలతో ప్రయోజనం
- ఫ్యాటీ యాసిడ్లు, ఐరన్, జింక్, మెగ్నీషియం తీసుకోవాలని నిపుణుల సూచనలు
- పాలకూర, గుడ్లు, బాదం వంటి ఆహారంతో ఉపయోగం ఉంటుందని వెల్లడి
మారుతున్న జీవనశైలి, కాలుష్యం కారణంగా జట్టు రాలిపోవడం సాధారణంగా మారిపోయింది. చాలా మందికి యుక్త వయసులోనే బట్టతల వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పలు రకాల షాంపూలు వాడటం, కేశ సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోపాటు ఆహారంలో తగిన పోషకాలు అందకపోవడం కూడా జుట్టు రాలిపోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. కేశ సంరక్షణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే.. తగిన ఆహారం తీసుకోవడం ద్వారా జుట్టు రాలిపోకుండా ఉంటుందని, వీలైతే జుట్టు ఒత్తుగా మరింత బాగా పెరుగుతుందని వివరిస్తున్నారు. ఇందుకోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో వివరిస్తున్నారు.
ఏమేం పోషకాలు అవసరం?
మన జుట్టు నల్లగా నిగనిగలాడటంతోపాటు దృఢంగా ఉండటానికి కొన్ని పోషకాలు ఎక్కువగా అవసరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో జుట్టు రాలిపోవడాన్ని నియంత్రిస్తాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా పలు రకాల ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ సి, ఐరన్, జింక్, పలు ఇతర విటమిన్లు అవసరమని స్పష్టం చేస్తున్నారు.
1. పాలకూర
మన జుట్టు పెరుగుదలకు పాలకూర అద్భుతంగా తోడ్పడుతుందని.. దీనిలో విటమిన్ సి, ఏ, ఐరన్, ఫోలేట్ వెంట్రుకలు రాలిపోకుండా నియంత్రించడంతోపాటు దృఢంగా ఉండటానికి వీలు కల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. తరచూ పాలకూర తీసుకోవడం వల్ల కేశాలు ఆరోగ్యంగా ఉంటాయని అంటున్నారు. శరీరంలో తగిన స్థాయిలో ఐరన్ లేకపోవడం వల్ల అటు రక్తహీనతతోపాటు ఇటు జుట్టు రాలిపోవడం జరుగుతుందని గుర్తు చేస్తున్నారు.
2. కోడి గుడ్లు
కేశాల పెరుగుదలకు, బలంగా ఉండటానికి అవసరమైన ప్రోటీన్లు గుడ్లలో ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వెంట్రుకలు రాలిపోవడాన్ని నిరోధించే బయోటిన్ ఉంటుందని వివరిస్తున్నారు. వెంట్రుకలు ఏర్పడేదే కెరాటిన్ అనే ప్రొటీన్ తో అని, అందువల్ల ప్రోటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు తీసుకోవడం వల్ల లాభం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇక గుడ్లలో ఉండే జింక్, సెలీనియం వల్ల వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయని వెల్లడిస్తున్నారు.
3. బెర్రీస్
స్ట్రాబెర్రీ, ఇతర బెర్రీ రకాల పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి మన వెంట్రుకల కుదుళ్ల (ఫొలికల్స్)ను బలోపేతం చేస్తుందని.. అందువల్ల రోజూ బెర్రీస్ ను తీసుకోవడం వల్ల వెంట్రుకలు రాలిపోవడం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. బెర్రీస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వెంట్రుకలు పగులుబారడాన్ని నియంత్రిస్తాయని వివరిస్తున్నారు.
4. బాదం
బాదంలలో ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్లు, జింక్, విటమిన్ ఈ, బీ1, బీ6 విటమిన్లు, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ వెంట్రుకల పెరుగుదలకు బాగా తోడ్పడుతాయని చెబుతున్నారు. ఇక బాదంలోని పోషకాలు వెంట్రుకలను బలంగా, నిగనిగ మెరిసేలా చేస్తాయని వివరిస్తున్నారు. కాలుష్యం, ఇతర సమస్యల వల్ల వెంట్రుకలు దెబ్బతినకుండా రక్షణ గోడలా బాదం పనిచేస్తుందని స్పష్టం చేస్తున్నారు. వెంట్రుకలు మందంగా ఉండటానికి తోడ్పడే మెగ్నీషియం కూడా బాదంలలో ఎక్కువని చెబుతున్నారు.
5. చియా (సబ్జ) గింజలు
చియా గింజల్లో ప్రోటీన్లు, రాగి, ఫాస్పరాస్, కెరాటిన్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి వెంట్రుకల పెరుగుదలకు తోడ్పడటంతోపాటు మందంగా అవడానికి వీలు కల్పిస్తాయి. వెంట్రుకలు విరిగిపోకుండా, పగులు బారకుండా ఇందులోని పోషకాలు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇందులోని పలు రకాల రసాయనాలు కుదుళ్ల ఇన్ఫెక్షన్లను నియంత్రించి ఆరోగ్యకరమైన కేశ సంపదను ఇస్తాయని వివరిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు పాటించండి
సాధారణంగా ఉన్నట్టుండి వెంట్రుకలు రాలిపోవడానికి పలు రకాల అనారోగ్యాలు, వ్యాధులు కూడా కారణం కావొచ్చని.. అందువల్ల వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర సరిగా లేకపోవడం, మానసిక ఒత్తిళ్లు వంటివి కూడా జుట్టు పలచబడటానికి దారి తీస్తుందని వివరిస్తున్నారు. అందువల్ల సమస్య ఎక్కడుందో గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని.. దానికి తోడు సరైన ఆహారం ద్వారా అందమైన కేశ సంపద సొంతమవుతుందని స్పష్టం చేస్తున్నారు.