AP High Court: దుల్హన్ పథకాన్ని ఎందుకు ఆపేశారన్న హైకోర్టు... రూ.1 లక్షకు పెంచి అమలు చేయనున్నామన్న ఏపీ సర్కారు
- టీడీపీ హయాంలో అమలు అయిన దుల్హన్ పథకం
- వైసీపీ సర్కారు వచ్చాక రద్దయిన దుల్హన్
- ఈ పథకం రద్దుపై హైకోర్టును ఆశ్రయించిన మైనారిటీ పరిరక్షణ సమితి
- రూ.50 వేల ప్రోత్సాహకాన్ని రూ.1 లక్షకు పెంచినట్టుగా ఏజీ వెల్లడి
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం మైనారిటీలకు అమలు చేసిన దుల్హన్ పథకంపై గురువారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. మైనారిటీ పరిరక్షణ సమితి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఇప్పటికే ఓ దఫా విచారణ సాగగా... అసలు ఈ పథకాన్ని ఎందుకు ఆపేశారంటూ వైసీపీ సర్కారును హైకోర్టు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
గతంలో దుల్హన్ పథకం కింద పెళ్లి చేసుకున్న పేద ముస్లింలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించే వారు. అయితే ఇటీవలే వైఎస్సార్ కల్యాణమస్తు పేరిట వైసీపీ సర్కారు ఓ కొత్త పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద వివిధ వర్గాలకు చెందిన వారు పెళ్లి చేసుకునే సమయంలో వారికి ఆర్థిక తోడ్పాటు అందించేలా ప్రభుత్వం రూ.40 వేల నుంచి రూ.1.50 లక్షలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా మైనారిటీల కోసం వైఎస్సార్ షాదీ తోఫా పేరిట పెళ్లి చేసుకునే ముస్లింలకు రూ.1 లక్ష అందించనున్నారు.
హైకోర్టులో విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ కోర్టుకు ఓ అఫిడవిట్ సమర్పించారు. అందులో వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాలకు సంబంధించి ఇటీవలే ప్రభుత్వం విడుదల చేసిన జీవోను పొందుపరిచారు. అక్టోబర్ 1న నుంచి దుల్హన్ పథకం మాదిరే మరో పథకాన్ని అమలు చేయనున్నామని, అందులో గతంలో ఇచ్చిన రూ.50 వేల ప్రోత్సాహకాన్ని వైసీపీ ప్రభుత్వం రూ.1 లక్షకు పెంచి ఇవ్వనుందని తెలిపారు.