Asad Rauf: క్రికెట్ ప్రపంచంలో విషాదం.. మాజీ దిగ్గజ అంపైర్ అసద్ రవూఫ్ కన్నుమూత

Former Pakistan umpire Asad Rauf passes away

  • గుండెపోటుతో మృతి చెందిన అసద్ రవూఫ్
  • పాకిస్థాన్ దిగ్గజ అంపైర్లలో ఒకరిగా గుర్తింపు
  • 2006లో ఐసీసీ అంపైర్స్ ఎలైట్ ప్యానెల్‌లో చోటు
  • మాయని మచ్చగా ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు

క్రికెట్ ప్రపంచంలో తీరని విషాదం చోటుచేసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన మాజీ అంపైర్ అసద్ రవూఫ్ ఈ ఉదయం హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. కార్డియాక్ అరెస్ట్ కారణంగానే ఆయన మృతి చెందినట్టు చెబుతున్నారు. రవూఫ్ సోదరుడు తాహిర్ ఈ విషయాన్ని వెల్లడించారు. లాహోర్‌లోని లాండ్లా బజార్‌లో ఉన్న బట్టల షాపును మూసి ఇంటికి వచ్చిన తర్వాత చాతీలో అసౌకర్యంగా ఉందని చెప్పారని తాహిర్ తెలిపారు. ఆ వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. అయితే, ఆయనను బతికించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 

పంజాబ్‌లో పుట్టిన అసద్ పాకిస్థాన్ నుంచి వచ్చిన గొప్ప అంపైర్లలో ఒకరిగా పేరుగాంచారు. అలీం దార్ తర్వాత అంతటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2006లో రవూఫ్ ఐసీసీ అంపైర్స్ ఎలైట్ ప్యానెల్‌లో చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆయన 47 టెస్టులు, 98 వన్డేలు, 23 టీ20ల్లో అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. అంపైరింగ్‌లో ఏడేళ్లపాటు టాప్ ప్లేస్‌లో ఉన్న రవూఫ్‌ ప్రదర్శనపై వార్షిక సమీక్ష అనంతరం 2013లో ఆయనను అంపైర్స్ ఎలైట్ ప్యానెల్ నుంచి పక్కన పెట్టారు. 

1998లో అంపైరింగ్ ప్రస్థానాన్ని ప్రారంభించిన రవూఫ్.. పాకస్థాన్-శ్రీలంక మధ్య 2000వ సంవత్సరంలో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. నాలుగేళ్ల తర్వాత అంటే 2004లో తొలిసారి అంతర్జాతీయ అంపైర్ ప్యానెల్‌లో చోటు సాధించారు. ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్)లోనూ పలు మ్యాచ్‌లకు అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించిన రవూఫ్ 2013లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కున్నారు. ఆ తర్వాత ఆయన ఖ్యాతి తగ్గుతూ వచ్చింది. 

అంపైరింగ్‌‌కు ముందు రవూఫ్ పాకిస్థాన్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. 71 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 40 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడి వరుసగా 3423, 611 పరుగులు చేశారు. ఇందులో మూడు సెంచరీలు, 26 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆయన తన కెరియర్‌లో లాహోర్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్, పాకిస్థాన్ రైల్వేస్, పాకిస్థాన్ యూనివర్సిటీలకు ఆడారు.

Asad Rauf
Pakistan
Umpire
Cricket
IPL
  • Loading...

More Telugu News