Supreme Court: గాలి జనార్దన్ రెడ్డి కేసు విచారణ జాప్యంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు
![supreme court angry over gali janardhan reddy case hearing](https://imgd.ap7am.com/thumbnail/cr-20220914tn6321e68babc79.jpg)
- గాలి జనార్దన్ రెడ్డి కేసు విచారణపై సుప్రీంకోర్టులో విచారణ
- 12 ఏళ్లుగా ఈ కేసు విచారణలో ట్రయల్ జరగకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం
- ఈ జాప్యం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని వ్యాఖ్య
- కేసు విచారణ జాప్యానికి గల కారణాలను సీల్డ్ కవర్‌లో అందించాలని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఆదేశం
గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించి కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై నమోదైన కేసు విచారణకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. 12 ఏళ్ల క్రితం నమోదైన ఈ కేసులో ఇప్పటిదాకా కోర్టులో ట్రయల్ జరగకపోవడం విచారకరమని కోర్టు వ్యాఖ్యానించింది. తీవ్ర అభియోగాలున్న ఇలాంటి కేసుల ట్రయల్‌లో జాప్యం అంటే న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని కూడా కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
గాలి జనార్దన్ రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన గనుల అక్రమ తవ్వకాల కేసు ప్రస్తుతం హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసు విచారణపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగానే విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఈ కేసు విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా కేసు విచారణలో జాప్యానికి గల కారణాలను సీల్డ్ కవర్‌లో అందించాలని ఆదేశించింది.