Virat Kohli: ఒక్క సెంచరీతో 14 ర్యాంకులు ఎగబాకిన కోహ్లీ
- ఆసియా కప్ లో అదరగొట్టిన కోహ్లీ
- రెండు ఫిఫ్టీలు, ఒక సెంచరీతో రాణించిన వైనం
- ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ లో 15వ స్థానం
ఆసియా కప్ టోర్నీ ముగిసిన నేపథ్యంలో ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకులను విడుదల చేసింది. బ్యాటింగ్ ర్యాంకుల్లో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఒక్కసారిగా 14 ర్యాంకులు ఎగబాకడం విశేషం. కోహ్లీకి తాజా ర్యాంకింగ్స్ జాబితాలో 15వ స్థానం లభించింది.
ఇటీవల యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ లో కోహ్లీ ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలతో కలిపి 276 పరుగులు చేశాడు. ముఖ్యంగా, ఆఫ్ఘనిస్థాన్ పై విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 61 బంతుల్లోనే 122 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ప్రదర్శన అనంతరం కోహ్లీ ర్యాంకింగ్ మరింత మెరుగైంది.
ఇక, తాజా టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ తన 4వ ర్యాంకును పదిలం చేసుకున్నాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహ్మద్ రిజ్వాన్ నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. ఇక, ఆసియా కప్ లో విఫలమైన పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ రెండోర్యాంకు నుంచి మూడో ర్యాంకుకు పడిపోయాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 14వ స్థానంలో ఉన్నాడు.