Moon: త్వరలోనే దుబాయ్ కి సొంత 'చందమామ'

Soon Dubai makes its own moon

  • మూన్ దుబాయ్ పేరిట భారీ ప్రాజెక్టు
  • పర్యాటకులకు చంద్రుడిపై ఉన్న అనుభూతి
  • అంతరిక్ష పరిశోధన సంస్థలకు కూడా ఉపయోగపడేలా నిర్మాణం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఒకటైన దుబాయ్ కి ప్రధాన ఆదాయ వనరు చమురు. ఇక్కడ మరో ముఖ్య ఆదాయ రంగం పర్యాటకం. భవిష్యత్తులో దుబాయ్ ని అత్యంత ఆకర్షణీయ పర్యాటక స్థలంగా తీర్చిదిద్దేందుకు అక్కడి పాలకులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో, ఇక్కడి మీనా ప్రాంతంలో మూన్ దుబాయ్ పేరిట సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. 

ఇది అచ్చం చంద్రుడి ఉపరితలంపై ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. పర్యాటకులకే కాదు, అంతరిక్ష పరిశోధన సంస్థలు కూడా ఇక్కడ తమ వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేందుకు అనువుగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. 

మాథ్యూస్ అండ్ హెండర్సన్ మూన్ వరల్డ్ రిసార్ట్స్ ఓ ప్రకటనలో దీనిపై స్పందిస్తూ... మూన్ దుబాయ్ అతిపెద్ద, అత్యంత విజయవంతమైన ఆధునిక కాలపు టూరిజం ప్రాజెక్టు అవుతుందని వెల్లడించింది. ఈ మూన్ ప్రాజెక్టు వల్ల వార్షిక పర్యాటకుల సంఖ్య రెట్టింపవుతుందని తెలిపింది. 

కాగా, ఈ మూన్ రిసార్ట్ ను 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. స్పేస్ టూరిజంపై ఆసక్తి ఉన్నవారికి, ఖర్చు భరించగలిగిన వారికి ఇక్కడి లూనార్ కాలనీ అద్భుతమైన అనుభూతి కలిగిస్తుంది. చంద్రుడిపై ఎలా ఉంటుందో, అలాంటి వాతావరణాన్నే ఇక్కడ సృష్టించనున్నారు. 

దాంతోపాటే ఇక్కడ 300 ప్రైవేటు నివాస గృహాలు కూడా ఉంటాయట. కొద్దిపాటి స్థలంలోనే అధిక సంఖ్యలో గృహాల నిర్మాణం కోసం స్కై విల్లాస్ పేరిట డిస్క్ ఆకారంలో భవన నిర్మాణం చేపట్టనున్నారు.

 ఇప్పటికే బుర్జ్ ఖలీఫా వంటి భారీ నిర్మాణంతో ప్రపంచ పటంలో యూఏఈకి ప్రత్యేక స్థానం లభించగా, ఆ స్ఫూర్తితోనే ఈ మూన్ దుబాయ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్టు అర్థమవుతోంది.

Moon
Dubai
Moon Project
Resorts
Mena
  • Loading...

More Telugu News