YSRCP: ఈ నెల 22న కుప్పం టూర్‌కు జగన్... రూ.66 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
- టీడీపీ అధినేత సొంత నియోజకవర్గం కుప్పం
- సీఎం హోదాలో తొలిసారి కుప్పం వెళుతున్న జగన్
- స్థానిక ఎమ్మెల్యే హోదాలో జగన్ టూర్‌లో పాల్గొనాలంటూ చంద్రబాబుకు వెళ్లనున్న ఆహ్వానం
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పర్యటనకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళుతున్నారు. ఈ నెల 22న కుప్పంలో పర్యటించేందుకు జగన్ నిర్ణయించుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా కుప్పం పరిధిలో రూ.66 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు జగన్ శ్రీకారం చుట్టనున్నారు. విపక్ష నేత నియోజకవర్గంలో సీఎం పర్యటన పట్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
సీఎం హోదాలో కుప్పంకు తొలిసారి వెళుతున్న జగన్... తన పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే హోదాలో హాజరు కావాలంటూ చంద్రబాబుకు కూడా ఆహ్వానం పంపే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జగన్ టూర్‌లో చంద్రబాబు కనిపించకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక 2024 ఎన్నికల్లో ఎలాగైనా కుప్పంలో వైసీపీ జెండాను ఎగురవేయాలన్న కసితో అధికార పార్టీ సాగుతుండగా... వైసీపీ వ్యూహాలను తిప్పికొట్టి కుప్పంలో తన బలాన్ని నిరూపించుకునే దిశగా చంద్రబాబు కూడా జగన్ వెళ్లి వచ్చిన వెంటనే కుప్పం వెళ్లే అవకాశాలున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.