UK: రాణి పేరిట ఉండే బ్రిటన్ పాస్ పోర్టులు చెల్లుతాయా.. ప్రజల్లో కొత్త ఆందోళన.. అధికారుల వివరణ ఇదీ!
- రాణి మరణంతో పాస్ పోర్టులు మార్చుకోవాల్సి ఉంటుందా అనే సందేహాలు
- దీనిపై సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తడంతో అధికార వర్గాల వివరణ
- కొత్తగా జారీ చేసేటప్పుడు, పునరుద్ధరణ సమయంలో మారుస్తామని ప్రకటన
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మరణంతో ఆ దేశ ప్రజల్లో కొత్త కొత్త సందేహాలు కనిపిస్తున్నాయి. యూకే పాస్ పోర్టుల మొదటి పేజీపై ‘మహారాణి అధీనంలో పనిచేసే విదేశాంగ మంత్రిగా సంబంధిత వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పాస్ పోర్టు కలిగి ఉన్న వ్యక్తులు ఎటువంటి అడ్డంకులు లేకుండా, స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా అవసరమైన మేర సాయాన్ని, భద్రతను కల్పించండి’ అని రాసి ఉంటుంది. ఇప్పుడు రాణి లేకపోవడంతో పాస్ పోర్టుల పరిస్థితి ఏమిటి, వాటిని మార్చుకోవాలా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
మెల్లమెల్లగా మారుస్తామన్న బ్రిటన్
తమ పాస్ పోర్టులపై యూకే ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళనకు బ్రిటన్ ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. ఇప్పటికిప్పుడు పాస్ పోర్టులను మార్చుకోవాల్సిన అవసరం లేదని.. గడువు ముగిసిన పాస్ పోర్టులను పునరుద్ధరించుకొనే సమయంలో రాజు చార్లెస్-3 పేరిట జారీ చేస్తామని తెలిపాయి.
- చిత్రమైన విషయం ఏమిటంటే.. బ్రిటన్ లో రాచ కుటుంబం సహా ప్రజలందరికీ పాస్ పోర్టు తప్పనిసరి. ఒక్క మహారాణికి తప్ప!
- ఎందుకంటే అసలు పాస్ పోర్టులు జారీ అయ్యేదే మహారాణి పేరిట కాబట్టి ఆమెకు పాస్ పోర్టు ఉండదని అధికారవర్గాల వెల్లడి
- ఎలిజబెత్ మృతితో యూకే కరెన్సీ, స్టాంపులపైనా ‘రాణి’ అనే పదం బదులు రాజు అనే పదాన్ని చేర్చాల్సి వుంది.
- రాజుగా చార్లెస్-3 బాధ్యత చేపట్టనుండటంతో యూకే జాతీయ గీతం ‘గాడ్ సేవ్ ద క్వీన్’ను ‘గాడ్ సేవ్ ద కింగ్’గా మార్చాల్సి ఉంది.