CPI Ramakrishna: విశాఖను ధ్వంసం చేస్తున్నది వైసీపీ మంత్రులే: సీపీఐ రామకృష్ణ

YSRCP ministers are destroying Vizag says CPI Ramakrishna
  • విశాఖ ఒక్క రాత్రిలో అభివృద్ధి చెందలేదన్న రామకృష్ణ 
  • అమరావతి రైతుల పాదయాత్రపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచన 
  • మూడు రాజధానుల అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారని విమర్శ 
అమరావతి రైతులు చేపట్టబోతున్న మహాపాదయాత్రపై వైసీపీ మంత్రులు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రపై దండయాత్ర అంటూ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. పలువురు మంత్రులు కూడా ఇటువంటి కామెంట్లే చేశారు. ఈ వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. విశాఖను ధ్వంసం చేస్తున్నది వైసీపీ మంత్రులేనని ఆయన అన్నారు. 

విశాఖ ఒక్క రాత్రిలో అభివృద్ధి చెందలేదని... పోర్టు, ఉక్కు కర్మాగారం వంటివి వచ్చిన తర్వాతే విశాఖ ప్రగతిపథంలో పయనించిందని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం చేస్తుంటే వైసీపీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. రైతుల పాదయాత్రపై మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని... ప్రజల మధ్య విద్వేషాలను పెంచే ప్రయత్నం చేయవద్దని అన్నారు. 

హైకోర్టు విచారణతో అమరావతి రాజధాని అంశం ముగిసిందని అందరూ భావించామని... మూడు రాజధానుల అంశాన్ని వెనక్కి తీసుకుంటున్నామని హైకోర్టులో వైసీపీ ప్రభుత్వం అఫిడవిట్ వేసిందని... అయితే, ఇప్పుడు మళ్లీ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. జగన్ మేనమామ కుమారుడు లేపాక్షి భూములను కొంటున్నాడని... ఆ భూములను తక్షణమే రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
CPI Ramakrishna
Amaravati
Farmers
Padayatra
Vizag
YSRCP

More Telugu News