Lakshmi Narasimha Swamy Temple: 36 ఏళ్ల కిందట మూతపడిన కపిలతీర్థంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃప్రతిష్ఠాపనకు టీటీడీ నిర్ణయం
- ప్రస్తుతం పునరుద్ధరణ పనులు
- వివరాలు తెలిపిన టీటీడీ సభ్యుడు పోకల అశోక్ కుమార్
- ఇది ఎంతో విశిష్టత ఉన్న ఆలయం అని వెల్లడి
- ఆధారాలు ఉన్నాయని స్పష్టీకరణ
తిరుపతి నుంచి అలిపిరి వెళ్లే మార్గంలో కపిలతీర్థం ఉంటుంది. ఇది ప్రధానంగా శైవక్షేత్రం అయినప్పటికీ, ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ఉంది. ఇది ఎంతో పురాతనమైనది. అయితే ఈ ఆలయాన్ని 36 ఏళ్ల కిందట మూసివేశారు. ఇప్పుడీ ఆలయ పునఃప్రతిష్ఠాపన జరగనుంది. ప్రస్తుతం టీడీడీ ఆధ్వర్యంలో ఆలయ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.
దీనిపై టీటీడీ పాలకమండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్ వివరణ ఇచ్చారు. ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉన్నదని పండితులు నిర్ణయించారని అన్నారు. స్వామి వారు ఇక్కడి కోనేరులో స్నానం చేసి, ఆలయంలో పూజలు చేసి సొరంగ మార్గంలో తిరుమలకు వెళ్లేవారని చరిత్ర చెబుతోందని వివరించారు. అందుకు ఆధారాలు కూడా కనిపిస్తున్నాయని తెలిపారు. ఇంతటి విశిష్ట ఆలయాన్ని తిరుపతి వాసులు, దేశం నలమూలల నుంచి వచ్చే భక్తులు దర్శించుకునేవారని వెల్లడించారు.
ఆలయంలో ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో గుర్తించి పునరుద్ధరిస్తున్నామని పోకల అశోక్ కుమార్ పేర్కొన్నారు. పనులు వేగంగా జరుగుతున్నాయని, డిసెంబరు మాసంలో 2, 3, 4 తేదీల్లో పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు.